రాజధాని మార్పు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కానీ ఓ చట్టం అమల్లోకి రావాలంటే.. అసెంబ్లీ మాత్రమే కాదు..శాసన మండలి కూడా ఆమోదించాలి. అందుకే 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు, 21 వ తేదీన కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేశారు. మండలిలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందుకే ఇంగ్లిష్ మీడియం బిల్లు ఇంత వరకూ ఆమోదం పొందలేదు. ఇప్పుడు సీఆర్డీఏను రద్దు చేసి.. రాజధానిని తరలించే బిల్లునూ టీడీపీ అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఉమ్మడి సమావేశం సహా.. అనే ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం వెదికింది. కానీ.. ఏదీ కూడా రాజ్యాంగపరంగా వర్కవుట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.
న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం.. రాజధాని తరలింపు అనే మాట బిల్లులో పెట్టడం లేదు. పాలనా సౌలభ్యం కోసం రాజధాని అమరావతిలో ఉన్న సచివాలయం, ఇతర హెచ్.ఓ.డి కార్యాలయాలను విశాఖపట్నం తరలించే విధంగా జోనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ బిల్లు ద్వారా తమకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని ఉత్తర్వులను జారీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలతో బిల్లులు రెడీ చేశారు. కానీ అసెంబ్లీలో.. పాస్ అయిపోతుంది. కానీ.. మండలిలో మాత్రం ఆగిపోతుంది.
మండలిలో బిల్లులను పాస్ చేసుకోవడానికి కొంత మంది టీడీపీ ఎమ్మెల్సీలపై.. వైసీపీ గురి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ నిర్ణయానికి కేంద్రం మద్దతు ఉందని.. చెబుతూ.. ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొంత మందితో సంప్రదింపులు కూడా జరిగాయని అంటున్నారు. అందుకే.. ఇరవయ్యో తేదీ అసెంబ్లీ, మండలి సమావేశాల్లో.. అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.