ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిపాలన నవ్వులాట అయిపోయింది. రాజధాని వ్యవహారం ఇంకా ఇంకా కామెడీ అయిపోయింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. శనివారం కేబినెట్ భేటీ ఉంటుందని.. ప్రభుత్వం నిన్న సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, అధికారులకు సమాచారం పంపారు. మళ్లీ మూడు, నాలుగు గంటలు గడవక ముందే … కేబినెట్ భేటీని మళ్లీ సోమవారమే ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. తల పట్టుకోవడం.. అధికారులు, మంత్రుల వంతు అయింది. వాస్తవంగా హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖలో పెట్టాలనే నిర్ణయానికి రావడానికి కేబినెట్ భేటీని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని.. అదే రోజు అసెంబ్లీని సమావేశపర్చాలని.. గతంలో నిర్ణయించారు.
దానికి తగ్గట్లుగానే… సీఎంతో జరిగిన సమావేశంలో హైపవర్ కమిటీ ..ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. కేవలం ప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చారు. రెండు రోజుల్లో అంటే… కేబినెట్ భేటీ జరుగుతుందని భావించిన 20వ తేదీన లేదా.. అంతకు ముందు రోజు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలనుకున్నారు. అయితే.. మధ్యలో న్యాయపరమైన సవాళ్లను.. ఎదుర్కొనేందుకు.. హైకోర్టుకు చాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు.. శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని అనుకున్నారు. ఇలా అనుకున్నదే తడవుగా ఉత్తర్వులొచ్చేశాయి. కానీ.. అలా నిర్వహించడం అవసరమా.. అని మళ్లీ.. ప్రభుత్వ పెద్దల్లోనే ఆలోచన వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే.. మళ్లీ కేబినెట్ భేటీని సోమవారానికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
నిలకడ లేని ఆలోచనలు.. అంతకు మించి అవగాహనా రాహిత్యంతో… ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు.. అధికారుల్ని.. నానా తిప్పలు పెడుతున్నాయి. ప్రజల పరిస్థితీ అంతే ఉంది. రాజధాని మార్పునకు అసలు కారణం ఏమిటో చెప్పకుండా.. అదంటూ.. ఇదంటూ.. ప్రభుత్వం హడావుడి చేస్తున్నట్లుగానే.. ఆ నిర్ణయం అమలుకూ… ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియక ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతున్నారు.