పవన్ కల్యాణ్ `పింక్` రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే బాలీవుడ్ `పింక్`ని మన మల్టీప్లెక్స్ ప్రేక్షకులు చూసేశారు. కథైతే అందరికీ తెలిసిందే. తమిళంలోనూ ఈ సినిమాని రీమేక్ చేశారు. ఇలాంటప్పుడు `పింక్` తెలుగు రీమేక్‌ని ఆసక్తికరంగా మలచడం కత్తిమీద సామే. అందుకే వేణు శ్రీరామ్ ధైర్యంగా కొన్ని అడుగులు వేశాడు. కథలో కీలకమైన మార్పులు చేశాడని సమాచారం. ముఖ్యంగా పవన్ ఇమేజ్‌కి, క్రేజ్కీ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాడట. పవన్‌ని అమితాబ్‌లో 80 ఏళ్ల ముసలివాడిగా చూపించడం చెల్లదు. కేవలం పవన్‌ని కోర్టులో వాదనల సీన్‌కి పరిమితం చేయడం కుదరదు. అందుకే.. వీలున్న చోట పవన్‌లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నార్ట. మరి ఈ మార్పులు ఎంత వరకూ నప్పుతాయన్నది తెలీదు. మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటే, మాతృకలోని ఆత్మ దెబ్బతినేప్రమాదం ఉంది. అయితే దిల్‌రాజు… అంత రిస్కు చేయడు. తనకు తన సినిమాని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. పైగా పవన్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఆ అవకాశం ఇలా వచ్చింది. ఇలాంటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో కదా..? అందుకే స్క్రిప్టు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, మార్పులు చేర్పులు మరీ గీత దాటకుండా జాగ్రత్త పడుతున్నాడట. మరి అంతిమ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.