మున్సిపల్ ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించకపోతే పదవులు ఊడగొడతా అంటూ ఇప్పటికే మంత్రులకూ తెరాస నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలబోయే అభ్యర్థులకు ముందస్తుగానే ఇదే రకమైన వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెరాస అభ్యర్థుల్ని గెలిపించగానే శిక్షణ ఇస్తామన్నారు. వీళ్లు సక్కగ పనిచేయకపోతే పదవి ఎగరగొట్టుడు ఖాయమన్నారు.
ఈసారి ఊరుకునే సమస్యే లేదనీ, ఎందుకంటే తెలంగాణ కొత్తగా వచ్చిందనీ, ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు కేటీఆర్. ఇప్పుడిప్పుడే పల్లెలు బాగైతున్నాయనీ, అలాగే పట్టణాలు కూడా బాగు కావాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం తెచ్చుకున్నామనీ, విధుల విషయంలో శిక్షణ వీరికి ఇస్తామనీ, నిధులు కూడా సమయానికి వచ్చేలా చేస్తామనీ, ఈ రెండూ జరిగిన తరువాత కూడా పట్టణాలు బాగుపడతలేదంటే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలన్నారు. ఆ అధికారాన్ని ఈసారి తప్పకుండా అమలు చేసి చూపిస్తామన్నారు కేటీఆర్. మరో నాలుగేళ్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి, తెరాస అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు.
తెరాసలో సొంత పార్టీ నేతలే ప్రోత్సహిస్తున్న రెబెల్స్ కొంతమంది బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇదేం పెద్ద బెడద కాదన్నట్టూ, పార్టీ నుంచి ఎక్కువమంది పోటీ చేస్తామంటూ ముందుకు రావడాన్ని పాజిటివ్ గా చూడాలని ఈ మధ్యనే కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రెబెల్స్ బెడద అస్సలు లేదనీ, దాదాపు అందర్నీ పోటీ నుంచి విరమింపజేశామని కూడా ప్రకటన చేశారు. కానీ, ఇప్పుడు అదే రెబెల్స్ తో జాగ్రత్త అన్నట్టు ఓటర్లకు సందేశం ఇచ్చారు. కారు గుర్తు అభ్యర్థికి మాత్రమే ఓటెయ్యాలనీ, కొంతమంది వచ్చి.. గెలవంగనే తెరాసలో కలుస్తామంటూ ఓటెయ్యాలంటూ ప్రచారం చేసుకుంటున్నారనీ, అలాంటివాళ్లను నమ్మొద్దన్నారు కేటీఆర్. అధికారికంగా పార్టీ బీఫామ్ ఇచ్చినవాళ్లకి మాత్రమే ఓటెయ్యాలన్నారు. అంటే, రెబెల్స్ బెడద క్షేత్రస్థాయిలో ఉందని చెబుతున్నట్టే.