రాజధానిని తరలించినా రైతులకు మేలు చేస్తున్నామని ప్రభుత్వం సోమవారం ప్రకటించనుంది. రైతులకు కళ్లు తిరిగే ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. దీని విలువ రూ. లక్ష కోట్ల వరకూ ఉంటుందన్న అంచనాలు ప్రారంభమయింది. హైపవర్ కమిటీ .. రైతులకు ఎలాంటి మేళ్లు చేయాలన్నదానిపై కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి.. రాజధాని రైతులకు.. భూసమీకరణలో భాగంగా..అభివృద్ధి చేసి ఇస్తామన్న భూమికి అదనంగా రెండు వందల గజాలు ఇవ్వాలనే సూచన. దీని ప్రకారం.. ప్రభుత్వంపై ఆర్థికంగా పడే భారం.. కొన్ని వేల కోట్లు ఉంటుంది. రాజధానిని తరలించిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం..భూముల్ని అభివృద్ధి చేస్తే.. రూ. కొన్ని వేల కోట్లు ఖర్చవుతుంది. అదే సమయంలో.. ఎకరానికి రెండు వందల గజాల చొప్పున రైతులకు తిరిగి ఇవ్వడంతో ప్రభుత్వానికి మిగిలే భూమి తగ్గిపోతుంది.
ఇక రాజధాని రైతులకు ఇచ్చే కౌలును కూడా.. భారీగా పెంచాలనే సిఫార్సు చేశారు. అలాగే.. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కౌలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు పదమూడేళ్లు ఇవ్వాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. ఇవి మాత్రమే కాదు.. తుళ్లూరు, తాడికొండ మండలాల్లోని గ్రామాలను కలిపి కార్పొరేషన్, గుంటూరు జిల్లాలోని కాజా నుంచి కృష్ణాజిల్లాలోని గుండుగొలను వరకు ఔటర్ రింగ్ రోడ్, వైకుంఠపురం నుంచి కృష్ణాజిల్లాలోకి కృష్ణానదిపై రోడ్ కమ్ బ్యారేజ్, కృష్ణాజిల్లా పరిటాల వద్ద నదిపై కూడా మరో నూతన వంతెనను కూడా నిర్మిస్తే.. అమరావతి అభివృద్ధి ఆగదని.. హైవపర్ కమిటీ అంచనా వేసింది. ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని అభివృద్ధి పనులను కూడా సిఫార్సు చేసింది.
మొత్తంగా.. ఓ రూ. లక్ష కోట్లు ఖర్చయ్యేలా.. ఈ ప్రతిపాదనలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతులు ఆశ్చర్యపోయేలా ప్రచారంలోకి వచ్చిన ఈ తాయిలాలను చూసి.. రాజధాని రైతులు కూడా.. ఆశ్చర్యపోతున్నారు. రూ. లక్ష కోట్లతో రాజధాని కట్టలేమని చెబుతూ.. అంతే మొత్తంతో.. పరిహారం, అభివృద్ధి పనులు ఎలా చేస్తారన్న సందేహాలు వస్తున్నాయి. చేస్తామని చెబుతారు కానీ.. చేస్తారా ఏంటి.. అని కొందరు.. సెటైర్లు కూడా వేస్తున్నారు.