తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కోడి పందేల కోసం ఏపీకి వెళ్లారు. అక్కడ ఆయనకు వైసీపీ నేతలు తులాభారం వేశారు. కానీ.. ఏపీకి చెందిన ఏ ఒక్క మంత్రి అయినా.. అలా తెలంగాణకు వెళ్లగలరా..? అక్కడ కనీస మర్యాద పొందగలరా..? ఇది.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతాపు ఆర్టికల్‌లో రాసిన సందేహం. ఇందులో ఆయనే సమాధానం చెప్పారు.. తెలంగాణ ప్రజలు అలాంటి పనులు చేయరని.. తేల్చేశారు. నిజానికి తెలంగాణ ఉద్యమం.. ఆంధ్ర వ్యతిరేకత మీద నడిచింది. ఏపీ వాసులనే విలన్లుగా చూపి.. సొంత రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ వారికి .. మళ్లీ ఏపీ వారికి రెడ్ కార్పెట్లు.. తులాభారాలు వేసే మానసిక స్థితి లేదు. కానీ… తెలంగాణతో తిట్టించుకుని.. హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టబడిన ఆంధ్రులు మాత్రం.. తెలంగాణ మంత్రులకు తులాభారాలు వేసి.. తమను తాము కించపరుచుకుంటున్నారని.. ఆర్కే చెబుతున్నారు. అంతే కాదు.. తెలంగాణకు చెందిన ఏ రాజకీయ నేతపై అయినా… ఓ ఏపీ రాజకీయ నేత కామెంట్ చేస్తే.. పార్టీలకు అతీతంగా.. తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లుగా తెలంగాణ ప్రజలు భావించే పరిస్థితి ఉంది. కానీ ఏపీ ప్రజలు.. మాత్రం.. తన ప్రాంత నేతను.. తెలంగాణ మంత్రి వచ్చి.. బూతులు తిట్టినా.. సంకలు గుద్దుకునే పరిస్థితి ఉంది. అందుకే.. ఆర్కే.. ఏపీ ప్రజలకు సిగ్గు, పౌరుషం లేవన్న అర్థంలో తీసి పడేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్నవారు ఆంధ్రాలో అధికారంలో ఉన్నవారిని తక్కువ చేసిన మాట్లాడినా లేక ప్రజలను చులకన చేసి మాట్లాడినా అది ఆంధ్రప్రదేశ్‌కే అవమానం!.. అని స్పష్టం చేశారు.
ఎప్పటిలాగే ప్రభుత్వం తీరుపై.. ఆర్కే.. తన కొత్తపలుకులో.. తీవ్రంగా విమర్శించారు. రాజధాని అంశంలో ప్రభుత్వ వైఖరి కారణంగా.. ఏపీ నాశనమైపోయిందని.. ఇక ఏపీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని తేల్చేశారు. మంత్రుల తీరునూ.. తప్పు పట్టారు. అసలు బొత్స మాట్లాడేది ఎవరికి అర్థమవుతుందని ప్రశ్నించారు. బొత్స తెలుగులో మాట్లాడినప్పటికీ.. పక్కన ఇంకొకరితో.. ఆయనేం మాట్లాడారో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అయితే.. తెలంగాణలో పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్లే ఆందోళనలు వచ్చాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆర్కే వ్యతిరేక కామెంట్లు చేశారు. జిల్లాల విభజన సమయంలోనూ అభ్యంతరాలు వచ్చాయని.. గుర్తు చేశారు. కానీ రాజధాని మార్పునకు.. జిల్లాల విభజనకు సంబంధం లేదన్నారు.
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా.. ఆర్కే ప్రశ్నించారు. కేంద్రం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులను కూడా సంక్షేమ కార్యక్రమాలకే మళ్లిస్తున్నారని తేల్చారు. చివరికి అటవీ అభివృద్ధి కోసం కేంద్రం ఇటీవల వెయ్యి కోట్లకుపైగా “కంపా” నిధులను రాష్ట్రానికి విడుదల చేస్తే.. వాటినీ కూడా.. పంచుడు పథకాలకే తరలించారు. అటవీ విస్తరణ పనులను పక్కన పెట్టేశారు. మొత్తానికి ఇప్పుడు చేయగలిగిదేమీ లేదని.. ఏపీ ప్రజలకు అంతకు అంత అనుభవించాల్సిందేనని ఆర్కే అంతిమంగా తేల్చారు.