అమరావతిని మారిస్తే ఎంత నష్టం జరుగుతుంది..? దీనిపై.. తెలుగుదేశం.. రాష్ట్ర భవిష్యత్ అంత.. భవిష్యత్ తరాల జీవితాలు వలస పోకుండా ఉండే అంత.. అని.. చెబుతూ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ఓ ఫిగర్ చెప్పింది. ఆ మొత్తం రూ. పది లక్షల కోట్లు. ఆదాయ వ్యయాల లెక్కల్లో ఆరితేరిపోయిన .. ప్రఖ్యాతి గాంచిన ఆడిటర్ విజయసాయిరెడ్డి చెప్పిన లెక్క. అమరావతిని నిలిపివేస్తే.. రూ. పది లక్షల కోట్ల సంపద హుష్ కాకి అవుతుందనే.. చంద్రబాబు.. ఇంత హడావుడి చేస్తున్నారని ఆయన అంటున్నారు. చంద్రబాబు హడావుడి ఎందుకు చేస్తున్నారనేది పక్కన పెడదాం.. కానీ రూ. పది లక్షల కోట్లు అనే ఫిగర్‌ని మాత్రం.. ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే.
అమరావతి వల్ల రూ. 10 లక్షల కోట్ల సంపద సృష్టి..!
అమరావతిని నిర్మిస్తే.. ఎలాంటి లాభం ఉండదని.. పైగా వడ్డీలు ఎక్కువగా కట్టుకోవాల్సి వస్తుందని.. ప్రభుత్వం వాదన వినిపిస్తూ వస్తోంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. రూ. పది లక్షల కోట్ల లెక్క చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తే..రూ. పది లక్షల కోట్లు వస్తాయని.. దాన్ని మార్చేస్తే.. వాటన్నింటినీ రాకుండా చేయవచ్చని.. విజయసాయిరెడ్డి ఆలోచన. ఆయన దృష్టిలో ఆ మొత్తం.. చంద్రబాబుకు వస్తాయని అనుకున్నారేమో కానీ.. నిజంగా అమరావతి అభిృవృద్ది చెందితే.. వచ్చేది ప్రభుత్వానికే. అంటే ప్రజలకే. ఈ లాజిక్‌ను విజయసాయిరెడ్డి మర్చిపోతున్నారు.
ఈ రూ. పది లక్షల కోట్లు ప్రజా సంపదే..!
రూ. పది లక్షల కోట్లు అంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అత్యంత భాగ్యవంతమైన రాష్ట్రాల్లో ఒకటిగా మారిపోతుంది. ఆదాయం ప్రకారం చూసుకుంటే.. పదేళ్ల రాష్ట్ర ఆదాయం. అమరావతిపై ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు అని వాదిస్తోంది. విజయసాయిరెడ్డి చెప్పిన లెక్క ప్రకారం.. రూ. పది లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద అభివృద్ధి చెందితే.. రూ. లక్ష కోట్ల పెట్టుబడి.. అసలు లెక్కే కాదు. ఈ విషయం వ్యాపారాల్లో రాటుదేలిపోయిన విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు తెలియక కాదు.
తెలిసి కూడా ఏపీని నాశనం చేస్తున్న పాలకులు..!
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే.. అమరావతి తరలిస్తే ఎంత నష్టమో.. వారికి స్పష్టత ఉంది. ఆ మొత్తం రాష్ట్ర భవిష్యత్‌ను మార్చేసే అంత అని కూడా వారికి తెలుసు. అయినప్పటికీ.. సొంత రాష్ట్ర ప్రయోజనాలను.. నిర్వీర్యం చేయడానికి… రూ. పది లక్షల కోట్ల సంపదను.. హారతి కర్పూరం చేయడానికి వారు సిద్ధమయ్యారన్న విషయం కూడా క్లారిటీ ఉంది. ప్రభుత్వ విధానాలను నిర్ణయించే స్థితిలో ఉన్న ఓ పాలకుడు.. ఇలా.. సొంత రాష్ట్రాన్ని ఆర్థికంగా కుందదీసే.. కుట్రలు చేయడం.. బహుశా చరిత్రలో జరిగి ఉండదేమో.. జరగదేమో కూడా..!