మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగుస్తోంది. పోలింగ్ కి 48 గంటల ముందు ఎలాంటి సభలూ సమావేశాలూ ప్రచారాలు చెయ్యకూడదనే ఎన్నికల సంఘం నిబంధన. గడచిన కొద్దిరోజులుగా మూడు ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్లవి. మొత్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో తామే గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామన్నది తెరాస ధీమా. కాంగ్రెస్ పార్టీ కూడా 4 కార్పొరేషన్లు దక్కించుకుంటామనీ, 76 మున్సిపాలిటీల్లో గెలిచి తీరతామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ద్వితీయ ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న భాజపా 7 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీల మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్టు చెబుతోంది. ఈ లక్ష్య సాధనకు తగ్గట్టుగానే వీరి ప్రచార సరళి ఉందా?
ఈ ఎన్నికల్లో తెరాస ప్రచారం గతంలో మాదిరిగా హోరెత్తించలేదనే చెప్పాలి. ఎందుకంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి ఎక్కడికీ వెళ్లలేదు. బహిరంగ సభలు పెట్టలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేవలం తన సొంత నియోజక వర్గంలో మాత్రమే ప్రచారం చేసి, కొన్ని ప్రెస్ మీట్లకు పరిమితమయ్యారు. బాధ్యత అంతా ఎమ్మెల్యేల మీద పెట్టేశారు. క్షేత్రస్థాయిలో వీళ్ల హడావుడే కనిపించింది. అధికారంలో మరో నాలుగేళ్లు తామే ఉంటాం కాబట్టి, తమకే ఓటెయ్యడం కరెక్ట్ అనే సందేశాన్నైతే బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. రెబెల్స్ విషయంలోనే తెరాసలో కొంత కంగారైతే ఇంకా ఉందనే చెప్పాలి.
కాంగ్రెస్ విషయానికొస్తే… అధికార పార్టీ వైఫల్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య… ఇలా అందరి హడావుడీ కనిపించింది. అందరూ ప్రచారంలో బాగానే పాల్గొన్నారు. అయితే, తెరాస వైఫల్యాలను బలంగా ఎండగట్టగలిగారా అంటే… పూర్తిస్థాయిలో లేదనే చెప్పాలి. ‘ఎందుకు కాంగ్రెస్ కి ఓటెయ్యాలి’ అనేది ఈ ప్రచార పర్వంలో బలంగా తీసుకెళ్లలేకపోయారనే అభిప్రాయం కలుగుతోంది. తరచూ చేసే విమర్శల్నే ప్రచారంలో వినిపించారు. దానికి భిన్నంగా, ఒక బలమైన వాదన, చర్చలు, ధీటైన సవాళ్లను తెరాసకు చేయడంలో ఒకరిద్దరు నేతలు మినహా మిగతావాళ్లంతా ఫర్వాలేదనిపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కారు వైఫల్యాలను పూర్తిస్థాయిలో హైలైట్ చేయలేకపోయారు.
భాజపా నేతల హడావుడి బాగానే కనిపించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్టార్ కేంపెయినర్లగా ప్రచారం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మతపరమైన అంశాలను రెచ్చగొట్టే ప్రయత్నమే భాజపా చేసింది. కేంద్రం తీసుకొచ్చిన సి.ఎ.ఎ.ని వ్యతిరేకించడాన్ని పెద్ద బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా మజ్లిస్ తో తెరాస స్నేహాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, భాజపా అనుకున్న స్థాయిలో ఈ కాన్సెప్ట్ ప్రజల్లో చర్చనీయం కాలేదు అనేది చివర్లో వారికీ అర్థమైందనే అనుకోవాలి. అందుకే, ప్రచార పర్వం చివరికి వచ్చేసరికి.. కేంద్రం తెలంగాణ ఇచ్చిన నిధులెన్నననీ, కేటాయించిన ఇళ్లు ఏమైనాయనీ, కేంద్ర కేటాయింపులపై చర్చకు సిద్ధమా అంటూ కిషన్ రెడ్డి సవాళ్లు చేశారు. నిజానికి, ఇదే అంశాన్ని మొదట్నుంచీ ప్రచారంలో వాడుకుని ఉంటే బాగుండేది.
ప్రచారం ముగిస్తోంది కాబట్టి, ఇక మిగిలింది బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్. ఈ విషయంలో తెరాస ఇంతవరకూ పైచేయి సాధిస్తూనే వస్తోంది. అదే తరహాలో కాంగ్రెస్ కొంత వెనకబడుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం చెయ్యగలదో చూడాలి. భాజపాకి కిందిస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ మిగతా రెండు పార్టీలతో పోల్చితే కొంత సవాలుగానే ఉంటుంది. ఎందుకంటే, చాలాచోట్ల కిందిస్థాయిలో భాజపాకి బలమైన నెట్ వర్క్ ఇంకా ఏర్పడలేదనే చెప్పాలి. ఏదేమైనా, ఈ మూడు పార్టీలకు మిగులున్నది రెండ్రోజుల సమయమే.