మేూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును ఆదేశించారు. విప్ జారీ చేయడం లాంటి అవకాశాలు..ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనకు సాధ్యం కాదు. విప్ జారీ చేసినా.. అది రాపాకనే జారీ చేయాలి. కానీ.. అలాంటి పరిస్థితి లేకపోవడంతో.. పవన్ కల్యాణ్.. రాపాకకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నా.. పరిపాలనా వికేంద్రీకరణను వ్యతిరేకించాలని పవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాపాకకు స్పష్టమైన సందేశం పంపారు. ఓ లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పరిపాలన వికేంద్రీకరణ చేసి.. అభివృద్ధితో రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు..మూడు రాజధానులపై కేబినెట్లో నిర్ణయం తీసుకుని.. అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు.
అసెంబ్లీలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉంది. ప్రతిపక్షాలకు కనీస మెజార్టీ కూడా లేదు. జనసేనకు ఒకే ఎక్క ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఆయన జనసేన కంటే.. వైసీపీతోనే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా.. ఆయన గొప్పగా పొగుడుతున్నారు. జనసేన కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కొద్ది రోజుల కిందట.. పార్టీ విస్తృత స్థాయిసమావేశాలు జరుగుతున్నప్పటికీ.. ఆయన మంత్రి కొడాలి నానితో కలిసి కోళ్ల పందాల్లో పాల్గొన్నారు.
అధికారికంగా.., ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. వ్యవహారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఈ క్రమంలో.. ఆయనపై అనర్హతా వేటు కోసమో.. మరో విధంగా ఫిక్స్ చేయడానికి.. పవన్ కల్యాణ్.. ఈ లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కల్యాణ్ లేఖలో కోరినట్లుగా రాపాక మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే.. ఆయనపై.. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం.. లేకపోతే కోర్టుకెళ్లడం.. చేయాలని.. జనసేన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.