ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాకుండానే.. పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆయన.. సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. బిల్లులో ఏముంటాయో చెప్పారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని.. విశాఖకే రాజ్‌భవన్, హెచ్వోడీలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. 3,4 జిల్లాలను కలిపి ఒక జోనల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే.. అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసి రాజధాని రైతులకు ప్యాకేజీ ప్రకటిస్తామని.. నచ్చని రైతులకు.. భూములు వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు రాజమహల్‌లు అడగడం లేదని పొలాలకు నీళ్లు కావాలని మాత్రమే కోరుతున్నారన్నారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రత్యేక డిమాండ్లు వస్తూనే ఉన్నాయని
ఉపప్రాంతాల నుంచి కూడా ఎన్నో డిమాండ్లు ఉన్నాయన్నారు.
గత ప్రబుత్వం శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను పట్టించుకోకుండా.. నారాయణ కమిటీ వేసిందని విమర్శించారు. 52 శాతం మంది పిటిషన్లు ఇవ్వడానికి రాజధానికి వస్తున్నారని.. 25 శాతం మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారని బుగ్గన చెప్పారు. 20శాతం మంది ప్రజలు రికమెండేషన్ కోసం రాజధానికి వస్తున్నారని.. జిల్లాల్లోనే పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేస్తే .. ప్రజలు రాజధానికి రావాల్సిన అవసరం ఉండదని బుగ్గన తేల్చారు. చర్చలో బుగ్గన మళ్లీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. అమరావతి నిర్మిస్తే భావితరాలు నష్టపోతాయని… టీడీపీ నేతలు రాజధాని భూముల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కంతేరులో హెరిటేజ్ పేరు మీద 14 ఎకరాలు కొనుగోలు చేశారని.. అలాగే.. లంకా దినకర్, వేమూరి రవికుమార్, పరిటాల సునీత పేర్లపై భూముల కొనుగోలు చేశారని బుగ్గన ఆరోపించారు. జీవీఎస్ ఆంజనేయులు కుటుంబం 40 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశారన్నారు. కుటుంబ సభ్యుల పేర్ల మీద లింగమనేని, పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర.. కంభంపాటి రామ్మోహన్రావు, మురళీమోహన్ భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. విజయవాడకు దూరప్రాంతాలుగా ఉన్న తుళ్లూరులో భూములు ఎలా కొన్నారని బుగ్గన ప్రశ్నించారు. అమరావతిలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములపైనా బుగ్గన అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రైవేట్ సంస్థలకు 1300 ఎకరాలు ఇచ్చారని… ఎకరానికి రూ.కోటి చొప్పున కేంద్ర సంస్థలకు ..60ఏళ్ల లీజుకు భూములు ఇచ్చారన్నారు. కొన్ని బ్యాంకులకు ఎకరానికి రూ.4కోట్ల చొప్పున భూములిచ్చారని.. విద్యా సంస్థలకు మాత్రం.. 50 లక్షలకే ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వానికి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన లేదని .. ఎన్ని ఏళ్లైనా రాష్ట్ర ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నామని బుగ్గన చెప్పుకొచ్చారు. విశాఖ పరిపాలన రాజధాని అంటే ఎందుకు భయపడుతున్నారు.. విశాఖ ఏమైనా అడివా అని బుగ్గన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత హైకోర్టు దగ్గర క్యాంటీన్లో టీ కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తన నిర్ణయంతో.. రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని.. బుగ్గన చెప్పుకొచ్చారు.