తన నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి జరిగిందని.. ఇక తన నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు అక్కర్లేదని.. రాష్ట్రం మొత్తం తన నియోజకవర్గంలా అభివృద్ది చేయాలని.. ఇంత వరకూ… రాష్ట్రంలో.. దేశంలో కాదు.. ప్రపంచం మొత్తం ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా.. చట్టసభల్లో ప్రసంగించి ఉండరు. ఎందుకంటే.. అభివృద్ధి అనేది.. వంద మీటర్ల పరుగు పందెంలో అందుకునే గీత కాదు. ఓ ప్రాంత ప్రజాప్రతినిధిగా నిరంతర అభివృద్ధి కోరుకోవాలి. కానీ తన నియోజకవర్గానికి అభివృద్ధి చాలని.. చెప్పుకున్న మొట్టమొదటి ఎమ్మెల్యేగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిలిచారు. ఆయన అసెంబ్లీలో ఇలాంటి ప్రసంగమే చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయని రాజధాని తరలించడానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు.
అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని సీఎం ప్రకటించడం… తమ అదృష్టమని .. అమరావతికి దక్కిన గౌరవం అని ఆళ్ల రామకృష్ణారెడ్డి సంతోషపడ్డారు. తనకు రాజకీయ భవిష్యత్ కన్నా… రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని విశాల భావం చాటుకున్నారు. రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని .. అమరావతిని అగ్రికల్చర్ జోన్‌గా అభివృద్ధి చేయాలన్నారు. అమరావతిలోనే పెట్టుబడి అంతా పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌తో సామాన్యులకు పని ఉండదని అందువల్ల సెక్రటేరియట్ ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదన్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నానని ప్రకటించారు.
ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యే తమ ప్రాంతానికి రాజధాని కావాలని మాట్లాడారు. రాయలసీమ ఎమ్మెల్యేలు.. తమ ప్రాంతానికి రాజధాని కావాలన్న ఆకాంక్షను కనీసం బయట అయినా వ్యక్తం చేశారు. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం.. తమ ప్రాంతాలు… తిరుగులేని అభివృద్ధిలో ఉన్నాయని.. ఇక అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు.