జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజధాని గ్రామాల సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత రాజధాని గ్రామాలకు వెళ్లాలనుకున్నారు. ఉదయం అంతా.. రైతులపై లాఠీచార్జ్ జరగడం.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన వారిపై పోలీసులు విరుచుకుపడటంతో.. వారిని పరామర్శించడానికి వెళ్లాలనుకున్నారు. అయితే..ఈ విషయం తెలియడంతో.. పెద్ద ఎత్తున పోలీసులు మంగళగిరిలోని.. జనసేన కార్యాలయానికి వచ్చారు.
పవన్ కల్యాణ్ పర్యటనకు బయలుదేరితే అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. పలువురు పోలీసు అధికారులు పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. రాజధాని గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని.. పర్యటనకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు చర్చలు జరుపుతున్న సమయంలో.. ఆయన సోదరుడు నాగేంద్రబాబు.. జనసేన పార్టీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారని..పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
రాజధాని రైతులకు సంఘిభావం తెలిపేందుకు వచ్చామని.. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పోలీసు అధికారుల సూచలను పెద్దగా పట్టించుకోని పవన్ కల్యాణ్.. రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు.. బయటకు వచ్చారు. కానీ పోలీసులు ఆయనను గేటు వద్దే నిలిపివేశారు. అప్పటికే.. పవన్ కల్యాణ్‌ను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరగడంతో.. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో పోలీసులకు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాట చోటు చేసుకుంది.