జనసేన అధినేత పవన్ కల్యాణ్ లగేజ్ దించేసుకున్నారు. పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్… పదే పదే పవన్ కల్యాణ్‌ను కించ పరుస్తూ..ఆయన ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తూండటంతో.. పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేసింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్.. ఒక్కరే విజయం సాధించారు. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవడంతో..ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే.. కొన్ని రోజులకే ఆయన అధికార పార్టీ ఆకర్ష్‌కు లోనయ్యారు. తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపిస్తూ.. మెల్లగా దూరం జరిగారు. అదే సమయంలో.. అధికార పార్టీకి దగ్గరయ్యారు.
తెలుగు మీడియం రద్దు, మూడు రాజధానుల నిర్ణయాలపై..జనసేన స్టాండ్ కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆయనపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయోనని… పవన్ కల్యాణ్ నిన్నటి వరకూ కాస్త సాఫ్ట్ గానే వ్యవహరించారు. కానీ… మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందేనని..స్వయంగా పవన్ కల్యాణ్ లేఖ రాసినా… రాపాక పట్టించుకోలేదు. దాంతో ఆయన పదే పదే పార్టీని ధిక్కరించడం .. చర్చనీయాంశం కావడం ఇష్టం లేక.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల నుంచి పవన్ కల్యాణ్‌ను సైతం కించ పరిచేలా రాపాక వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ మీటింగ్ పెడితే మంద మంది వస్తారంటూ సెటైర్లు వేశారు. తాను తన సొంత ఇమేజ్‌తో గెలిచానని చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
నిజానికి రాపాక వరప్రసాద్‌లో 2014లో కూడా ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అప్పుడు ఆయన సొంత ఇమేజ్‌కు తెచ్చుకున్న ఓట్లు 318 అంటే 318. రాజోల్‌లో ఆయన ఇమేజ్ అంత వరకే. 2019 ఎన్నికల్లో కూడా.. ఆయన అన్ని పార్టీలనూ తిరిగారు. ఎవరూ టిక్కెట్ ఇవ్వలేదు. చివరికి పవన్ కల్యాణ్ దగ్గరకు తీసి టిక్కెట్ ఇచ్చి.. ప్రచారం చేసి గెలిపించారు. గెలిచిన తర్వాత రాపాకకు.. పవన్ కల్యాణ్ కన్నా..తానే గొప్ప అనే ఫీలింగ్ వచ్చేసింది. 2014లో వచ్చిన 318 ఓట్లు సంగతి ఆయన మర్చిపోయారు.