ఆంధ్రప్రదేశ్ బీజేపీ విచిత్రమైన పరిస్థితుల్లో పడింది. అమరావతి మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ… కేంద్ర అధికార పార్టీగా.. ఆ మార్పును అడ్డుకునే ప్రయత్నాన్ని కనీసం కూడా చేయలేదు. దీంతో.. పాటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తాము అన్నీ కేంద్రానికి చెప్పే చేస్తున్నామన్నట్లుగా.. సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపుతూండటంతో.. బీజేపీ చిత్తశుద్ధిపై అందరికీ అనుమానం ప్రారంభమయింది. దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి… బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. బీజేపీ అధ్యక్ష ఎంపిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కన్నా లక్ష్మినారాయణ.. అమరావతి అంశంపై హైకమాండ్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ.. అక్కడ.. ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ఏపీ ప్రభుత్వంపై.. పోరాటం చేయమని.. సలహా మాత్రం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన.. కన్నా లక్ష్మినారాయణ, జీవీఎల్ నరసింహారావు.. ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు కన్నా లక్ష్మినారాయణ ఎప్పట్లాగే.. అమరావతికి మద్దతుగా మాట్లాడారు. జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. విశాఖను దోచుకోవడానికే.. మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. జనసేనతో కలిసి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కన్నా విధానంలో క్లారిటీ ఉంది.. కానీ జీవీఎల్ వాయిస్ మాత్రం తేడా వచ్చేసింది. మూడు రాజధానుల విధానం బోగస్ అని విమర్శించి.. న్యాయపరమైన వివాదాలు రాకుండా ఉండటానికి అమరావతిని రాజధానిగా చెబుతున్నారా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ ఉన్నంత మాత్రాన.. అమరావతి రాజధాని కాదన్నారు. అయితే.. జీవీఎల్ నోటి వెంట మాత్రం.. అమరావతి రాజధానిగా ఉండాలనే మాట మాత్రం రాలేదు.
అయితే.. ఈ వివాదంలో వైసీపీ కన్నా.. జీవీఎల్ టీడీపీనే ఎక్కువగా విమర్శించడానికి ఆరాటపడ్డారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. అన్న టీడీపీ స్పందనపై… ఆయన మండిపడ్డారు. టీడీపీ చేతకాని తనాన్ని తమపై రుద్దాలనుకుంటోందని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం జరుగుతుందని.. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. కేంద్రానికి చెప్పే చేస్తున్నారని.. జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొత్తానికి బీజేపీ నేతలు.. జగన్ తమకు చెప్పి చేయలేదని.. ఒట్టు పెట్టి చెప్పడమే తక్కున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో.. జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు.