బీజేపీతో పొత్తు తర్వాత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. కమలంతో పొత్తుకు అమరావతియే రాజధాని ఉండాలన్న హామీ కూడా ఓ కారణం అంటున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని కరాఖండిగా పవన్ చెప్పడం వెనుక ఢిల్లీ నుంచి బలమైన హామీ ఉందనే అభిప్రాయం .. ఇతర పార్టీల్లోనూ వినిపిస్తోంది. సాయంత్రం హస్తినలో బీజేపీ- జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగబోతోంది..! ఈ మీటింగ్‌కు బీజేపీ అగ్రనేతలతో పాటు పవన్ కల్యాణ్ హాజరవుతారు. ఇందులో రాజధాని మార్పు అంశమే ప్రధాన అజెండాగా ఉంటుంది. అందుకే పవన్ సైతం తన ఢిల్లీ టూర్‌పై రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అమరావతి ఇక్కడి నుంచి కదలదని తేల్చి చెబుతున్నారు.
ఢిల్లీ సమావేశంలో ఏం జరగబోతుందో పవన్ మాటల్లోనే స్పష్టంచేశారు. రైతుల ఆందోళనలను, ఆవేదనను వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకపోవడంతో.. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగక తప్పదనే జనసేన, బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ రెండు పార్టీలు దీనిపై పోరాటానికే సిద్ధమయ్యారు. రాజధానిని మార్చే నిర్ణయం జగన్‌కి లేదని బీజేపీ చెబుతుంటే.. అసలు రాజధాని ఇంచు కూడా కదలదని జనసేన అంటోంది. దీంతో పవన్ ఢిల్లీ టూర్ రాజధాని పోరాటంలో టర్నింగ్ పాయింట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ఏపీలో కలిసిగట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు రాజధాని మార్పు అంశాన్ని ఉమ్మడి అజెండాగా మార్చుకున్నాయి.
ఇప్పుడు ఈ రెండు పార్టీల సమన్వయ భేటీల వేదిక ఢిల్లీకి మారడంతో.. అక్కడ వ్యూహం సిద్ధమడం ఖాయం అనుకోవచ్చు. రాజధాని రైతులు కూడా కేంద్రం స్పందించాలని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కీలక అంశంగా మారింది. రాజధాని పోరాటంలో పవన్ హస్తిన పర్యటనే కీలకం. నరేంద్రమోడీతో భేటీ కావాలని.. పవన్ కల్యాణ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఆయనకు.. అపాయింట్మెంట్ ఖరారయిందని చెబుతున్నారు. అదే జరిగితే మోడీ దగ్గర కూడా.. పవన్ కల్యాణ్ అమరావతి వాయిస్ వినిపించే అవకాశం ఉంది.