మంగళవారం అటు అసెంబ్లీలో.. ఇటు శాసనమండలిలో.. రెండు భిన్నమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యారు. అమరావతిపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తే.. దానికే స్పీకర్ తమ్మినేని సీతారాం.. హెడ్ ఫోన్స్ విసిరికొట్టి.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వెళ్లిపోయారు. అదే మండలిలో… పధ్నాలుగు మంది మంత్రులు అదీ కూడా మండలిలో సభ్యులు కాని వారు వచ్చి పోడియాన్ని చుట్టుముట్టినా.. చైర్మన్ షరీఫ్ ఎక్కడా సంయమనాన్ని కోల్పోలేదు. అందరికీ.. సర్ది చెప్పడానికే ప్రయత్నించారు. ఆయన నోటి నుంచి అనవసరంగా ఒక్క పదం బయటకు రాలేదు. ఎక్కడా సభ్యులపై అసహనం చూపించలేదు. మంత్రులు కటువుగా తనపై చేసిన వ్యాఖ్యలను.. కూడా…సున్నితంగానే ఖండించారు. తనకు రాజకీయాలు ఆపాదించవద్దన్నారు.
మండలి ఛైర్మన్ షరీఫ్ సభను నడిపిన తీరు.. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం వ్యవహారశైలి పోలిక రావడంతో సామాన్యుల్లోనూ చర్చ ప్రారంభమయింది. ఆరు సార్లు గెలిచి..మూడు సార్లు మంత్రి అయిన తమ్మినేని.. స్పీకర్‌గా మాత్రం ఆ స్థాయి అనుభవాన్ని ప్రదర్శించడం లేదు. సభలో తెలుగుదేశం సభ్యులకు మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణలను ఆయన తరచూ ఎదుర్కొంటున్నారు. నిజానికి తమకు సరైన అవకాశం రాని సందర్భంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తారు. ఏపీ అసెంబ్లీలో మాత్రం విచిత్రంగా స్పీకర్ బైటకు వెళ్లిపోయారు. అంతకు ముందు రోజు.. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని.. ముఖ్యమంత్రి జగన్‌ను నేరుగా ఆదేశించారు. ఇది కూడా వివాదాస్పదమయింది.
ఇక బయట ఆయన మాట్లాడుతున్న మాటలు.. మరింత వివాదాస్పదమవుతున్నాయి. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ను అదే పనిగా వాడుతున్నారు. దీనిపై విమర్శలు వస్తే… తాను ముందు ఎమ్మెల్యేనని..మరోకటని.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు.. శాసనమండలిలో చైర్మన్ షరీఫ్.. వ్యవహరిస్తున్న తీరు.. తమ్మినేని వ్యవహారిస్తున్న ఒకే సారి హైలెట్ కావడంతో.. శాసనసభాపతికి మైనస్ మార్కులు పడుతున్నాయి. షరీఫ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.