ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పుడు ఎటు చూసినా.. అనిశ్చితి.. ఆందోళనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయం కన్నా ఎక్కువగా పరిస్థితులు ఉద్రిక్తతంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రభుత్వ బాధితులు కనిపిస్తున్నారు. ఎక్కడా అభివృద్ధి పనులు కనిపించడం లేదు. ఉద్యోగుల జీతాలకు అనిశ్చితి ఏర్పడింది. కొత్తగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలిచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న సర్కార్ వారికి జీతాలివ్వడం లేదు.
ఏ అంటే అమరావతి .. పీ అంటే పోలవరం..! ముందుకు కదలని ఏపీ..!
ఎనిమిది నెలల కిందటి వరకు రాజధాని అమరావతి అనే ముద్ర ప్రజల్లో బలంగా ఉంది. దశాబ్దాల పాటు .. ప్రతిపాదనలకే పరిమితమై.. కాలువల తవ్వకమే.. పెద్ద పని అన్నట్లుగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెడుతూ నిర్మాణం అవుతోంది. ఓ గేటు కూడా పెట్టేశారు. 70 శాతం నిర్మాణం పూర్తయింది. మరో ఆరు నెలల్లో పూర్తయిపోతుందని… ప్రాజెక్టును సందర్శించిన వారు అనుకున్నారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఎనిమిది నెలల తర్వాత వెనక్కి చూసుకుంటే.. ఏ అంటే అనుకున్న అమరావతి.. మూడు ముక్కలయింది. అక్కడ జోరుగా సాగిన పనులు.. ఎక్కడివక్కడ ఆగిపోయాయి. శిధిలమయ్యే పరిస్థితి ఉంది. పీ అనుకున్న పోలవరం.. కూడా అదే పరిస్థితి. రివర్స్ టెండరింగ్ కారణంగా అక్కడ పనులేమీ జరగడం లేదు.
పరిశ్రమలు, పెట్టుబడులన్నీ రివర్స్..!
ఏ అంటే అమరావతి.. పీ అంటే.. పోలవరం అనే కాన్సెప్ట్‌తో పాలన చేసిన ఏపీ సర్కార్ వాటిని మాత్రమే కాదు.. పెట్టుబడులు ఆకర్షించి.. కియా, అశోక్ లేలాండ్ లాంటి ఆటోమోబైల్ కంపెనీలు.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌సీఎల్ లంటి సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు.. కొన్ని వందల కంపెనీలను.. వివిధ ప్రాంతాలకు తీసుకు వచ్చి.. యువతకు ఉపాధి పెంచే ప్రయత్నం చేశారు. అనేక కంపెనీలు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాడనికి ఎనిమిది నెలల కిందట వరకు.. రెడీగా ఉన్నాయి.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక ఎనిమిది నెలల్లో ఏపీకి కొత్తగా వచ్చిన పరిశ్రమ లేదు. కానీ.. ఆదాని… అంబానీలు…. కొన్ని వేలకోట్ల పెట్టుబడుల ప్రతిపాదలను విరమించుకున్నారు.
ఇనుప బూట్ల చప్పుళ్లు.. జగనన్నకు పొగడ్తలు..!
అన్నీ పోను.. ఇప్పుడు… ఆంధ్రప్రదేశ్ అనిశ్చితిలో చిక్కుకుంది. ప్రభుత్వాన్ని నమ్మి తమ సర్వశ్వం అనుకుని భూములిచ్చిన రైతులు… ఇప్పుడు ఆ ప్రభుత్వం చేతిలోనే వంచనకు గురయ్యారు. తమకు న్యాయం రగాలని..రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం తరపున పోలీసులు వారిపై ఉన్మాదంతో విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎవరికీ లాఠీ దెబ్బల్లో తేడా చూపించడం లేదు. పోలీసుల మోహరింపుతోనే ప్రభుత్వ పాలన సాగుతోంది. ఆంధ్రప్రేదశ్ రాష్ట్రం మొత్తం అనిశ్చితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి సామాన్యుల్ని సైతం ఆవేదనకు గురి చేస్తోంది.