సరిలేరు నీకెవ్వరులో – ట్రైన్ ఎపిసోడ్ పేలుతుందని ఓ రేంజులో ఊహించుకున్నారు సినీ జనాలు. దానికి తోడు దర్శక నిర్మాతలు, హీరో కూడా `అట్టా ఇట్టా ఉండదది` అన్నట్టే మాట్లాడారు. తీరా చూస్తే ట్రైన్ ఎపిసోడు తుస్సుమంది. ఆ సన్నివేశాలు ఇంకాస్త బెటర్‌గా ఉంటే, ఈ సినిమా ఫలితం మరో మెట్టు పైనే ఉండేది. ట్రైన్ ఎపిసోడ్ అనుకున్నంత స్థాయిలో నవ్వించలేదని, నిడివి కూడా ఎక్కువే ఉందన్న విమర్శలు వినిపించాయి.
అయితే వసూళ్లు బాగుండి, సినిమా హిట్టయిపోవడంతో – ఇవేం పట్టించుకోలేదు చిత్రబృందం. సరికదా.. ఇప్పుడు ట్రైన్ ఎపిసోడ్‌లోనే మరో సీన్ కూడా పెంచుతోంది. మహేష్ బాబు – రావు రమేష్‌ల మధ్యన దాదాపు 90 సెకన్ల నిడివి ఉన్న ఈ సన్నివేశాన్ని శుక్ర లేదా శనివారం నుంచి థియేటర్లలో కలుపుతున్నారు. రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడానికి ఈ సీన్ బాగా ఉపకరిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. శుక్రవారం నుంచి డిస్కోరాజా హడావుడి మొదలవుతుంది. దాన్ని తట్టుకోవడానికి దిల్‌రాజు ఇలా ప్లాన్ చేశాడన్నమాట. మరి అసలే ల్యాగ్ అనుకున్న ట్రైన్ ఎపిసోడ్‌ని ఇంకాస్త పెంచుతున్నారంటే.. ఆయన గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే.