జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న అమరావతిలో రైతులతో, మాహిళలతో మాట్లాడి వారి బాధలు విన్న, వారి కన్నీళ్లు చూసిన పవన్ కళ్యాణ్ విపరీతంగా ఆవేశపడిపోయాడు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, భయపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చాడు. జగన్ ప్రభుత్వాన్ని కూలదోసేదాకా నిద్రపోనని చెప్పాడు. మళ్లీ ఢిల్లీ వెళుతున్నానని, ప్రధానిని కలిసి మాట్లాడతానన్నాడు. ఇతర బీజేపీ పెద్దలనూ కలుస్తానన్నాడు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీరు బీజేపీ నేతలతో మాట్లాడాక అమరావతిపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ నిర్ణయిస్తారని అంటున్నారు.
జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోరాటానికి సిద్ధమవుతుండగా ప్రభుత్వం మాత్రం ‘మూడు రాజధానులు’ పై ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఎన్ని విమర్శలు వస్తున్నా లెక్కచేయడంలేదు. మండలిలో బిల్లు ఆమోదానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. మండలిలో బిల్లు ఆమోదం పొందలేని పక్షంలో మండలిని రద్దు చేయడానికి కూడా వెనకాడబోమని వైకాపా నేతలు హెచ్చరిస్తున్నారు. మండలిని రద్దు చేయాలనే చర్చ పార్టీలో సీరియస్‌గానే జరిగిందని, అవసరమైతే ప్రభుత్వం ఆ పని చేస్తుందని వైకాపా అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి చెప్పాడు. మూడు రాజధానుల నిర్ణయానికి కేంద్రం మద్దతు ఉందని కూడా సీరియస్‌గానే చెప్పాడు.
ఇదేదో తాము ప్రచారం కోసమో, బీజేపీని ఇరుకున పెట్టాలని చెప్పడంలేదని, ప్రభుత్వానికి కేంద్రం మద్దతు వాస్తవమేనని అన్నాడు. రాజధాని వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అవేశపడుతున్నంతగా బీజేపీ నేతలు ఆవేశపడటంలేదు. కేంద్రంలోని పార్టీ పెద్దలుగాని, ప్రభుత్వ పెద్దలుగాని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడటంలేదు. రాష్ట్ర బీజేపీలో ఇప్పటికీ గందరగోళం ఉందని కొందరు కాషాయ నాయకుల తీరు చూస్తే అర్థమవుతోంది. అమరావతిని కదలనివ్వబోమని బీజేపీ నాయకులు కొందరు ఏ ప్రాతిపదికన చెబుతున్నారో అర్థం కావడంలేదు. అందుకు అనుసరించే మార్గమేమిటో తెలియడంలేదు. బిల్లులోనూ రాజధాని నగరాన్ని మారుస్తున్నట్లుగా చెప్పలేదు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే అంటున్నారు.
చట్టానికి దొరక్కుండా ప్రభుత్వం పని చేస్తోందని జీవీఎల్ కూడా చెప్పాడు. అమరావతిని కదలనివ్వకుండా చేస్తానని, జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైకాపాకు దాసుడైపోయాక పవన్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థంకావడంలేదు. ప్రభుత్వాన్ని కూలదోస్తానని పవన్ ఏ ప్రాతిపదికన, ఏ ఆలోచనతో చెప్పాడో జనసేన నాయకులకే అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. అధినాయకుడి స్టేట్మెంటును సమర్థించలేక నానా తిప్పలు పడుతున్నారు. పవన్ మాదిరిగానే వారు కూడా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ గతంలో ఇరాక్‌లో వచ్చినటువంటి విప్లవం రాష్ట్రంలో వస్తుందన్నాడు. జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణ ఏమిటో పవన్ ఢిల్లీ నుంచి వస్తేగాని తెలియదు.