తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. శనివారం నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో 90 శాతం మున్సిపాలిటీలు గెలుచుకోవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు అధికార పార్టీ తెరాస నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆదరణను చూరగొనడంలో మరోసారి ప్రతిపక్షాలు వైఫల్యం చెందాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో తమ పట్టు నిరూపించుకోబోతున్నామని ప్రకటించింది. అయితే, తెరాసకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వచ్చిన భాజపా స్పందనే ప్రత్యేకంగా కనిపిస్తోంది. తరువాాత ఫలితాలు ఎలా ఉన్నా ఎన్నికలు జరిగిన రోజున అన్ని పార్టీలూ గెలుపు ధీమాతో ప్రకటనలు చేస్తాయి. కానీ, దీనికి భిన్నంగా తమని గెలవకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు చేసిందని ఆరోపించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.
ఇతర జిల్లాల నుంచి గ్రామాల నుంచి చాలామందిని తరలించి అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. నిజామాబాద్లో అధికార పార్టీ అనేక అడ్డదార్లు తొక్కిందన్నారు. తాండూరులో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారన్నారు. జగిత్యాలలో పోలింగ్ బూతులో తెరాస అభ్యర్థి కూర్చుని ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి మద్దతు ఇచ్చారన్నారు. ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించారన్నారు. భాజపా కార్యకర్తల మీద చాలాచోట్ల దాడులు చేశారన్నారు. భాజపా గెలిచే అవకాశం ఉన్న ప్రతీ మున్సిపాలిటీలో తెరాస దొంగ ఓట్లు వేయించిందన్నారు. నిజాంపేటలో ఎన్నికల రోజులు సెలవు ఇవ్వలేదనీ, ఉద్యోగులు, విద్యావంతుల్ని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా తెరాస అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ తీరు అంతా గమనిస్తే అధికార పార్టీ తెరాసకి ప్రధానమైన పోటీ భాజపాతోనే ఉందనేది స్పష్టమౌతోందన్నారు. భాజపాని నేరుగా ఎదుర్కొనలేకే కాంగ్రెస్, మజ్లిస్ లతో కలిసి తెరాస చాలా చోట్ల ఇలాంటి అక్రమాలకు పాల్పడిందన్నారు.
ఏతావాతా లక్ష్మణ్ చెప్పొచ్చేది ఏంటంటే… భాజపా గట్టిపోటీనే ఇచ్చింది, గెలిచేందుకు ఆ పార్టీకి చాలా చోట్ల ఆస్కారం ఉంది. కానీ, వాటిని తెరాస దెబ్బతీసింది! ఫలితాల అనంతరం భాజపాకి తక్కువ స్థానాలు దక్కాయే అనుకోండి… ఇదంతా తెరాస చేసిన కుట్ర అని తాము ముందు నుంచీ చెప్తూనే ఉన్నామనే వాదనను మరింత బలంగా వినిపించేందుకు వేసుకున్న పునాదిలా లక్ష్మణ్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గట్టిపోటీ ఇవ్వడం విజయం కాదు కదా? దాన్నే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి ఉన్న అర్హత అని చెప్పుకోవడమూ సరైంది కాదు. ఈ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సంఖ్యలో భాజపాకి స్థానాలు దక్కకపోతే… తామే ప్రత్యామ్నాయమంటూ ఇన్నాళ్లూ చేసుకుంటున్న ప్రచారానికి అర్థం లేకుండా పోవడమైతే ఖాయం.