అమరావతికి ప్రపంచబ్యాంక్ ఇస్తామన్న రుణాన్ని.. ఏపీ సర్కార్ కాలదన్నుకుందని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీజేపీ-జనసేన బృందానికి.. సాక్ష్యాలతో సహా వివరించారు. అమరావతి నిర్మాణం.. ఏపీ ఆర్థిక పరిస్థితులపై.. బీజేపీ -జనసేన నేతలు నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు.. అమరావతికి ప్రపంచబ్యాంక్ రుణంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతికి రుణం ఇచ్చేందుకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన ప్రపంచబ్యాంక్.. వైసీపీ అధికారంలోకి రాగానే.. రుణ ప్రతిపాదన విరమించుకుంది. దీనికి కారణం ఏమిటో క్లారిటీ లేదు. కానీ.. ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా.. అమరావతిని నిర్వీర్యం చేయాలన్న ముందస్తు ప్రణాళికతోనే.. ప్రపంచబ్యాంక్ రుణం అవసరం లేదన్నట్లుగా.. వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వం పదే పదే సంప్రదించినా… ప్రధాని మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. స్వయంగా .. వాకబు చేసినా కూడా.. ఏపీ సర్కార్.. ఆసక్తి చూపలేదు.
బతిమాలి మరీ అప్పు ఇచ్చే పరిస్థితుల్లో ప్రపంచబ్యాంక్ లేదు కాబట్టి.. సైలెంట్‌గా ప్రతిపాదన విరమించుకుంకుంది. రాజధాని నిర్మాణానికి “అమరావతి సస్టెయినబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్” పేరుతో 715 మిలియన్ డాలర్ల రుణం కోసం చంద్రబాబు సర్కార్ ప్రయత్నించింది. ఇది దాదాపుగా రూ. ఐదు వేల కోట్లతో సమానం. మరో రూ. రెండు వేల కోట్ల రుణం కోసం.. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌ను సంప్రదించింది. వరల్డ్ బ్యాంక్ తొలి దశలో సుమారు రూ.2065 కోట్లు రుణం ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలిదశలో రుణం తీసుకునేందుకు కేంద్రం కూడా అనుమతులిచ్చింది. అమరావతికి ఇక రుణం మంజూరేనని.. అనుకుంటున్న సమయంలో.. ప్రపంచబ్యాంక్ షాకిచ్చింది. రుణ ప్రతిపాదనల నుంచి ఒక్క సారిగా డ్రాప్ అయిపోయింది. అసలు దీని వెనుక ఏం జరిగిందన్నదానిపై.. మాత్రం.. రకరకాల చర్చలు జరిగాయి.
ఏపీలో చంద్రబాబు సర్కార్ ఓడిపోగానే… ప్రపంచబ్యాంక్ నుంచి కేంద్రానికి ఓ లేఖ వచ్చింది. అమరావతి రుణ ప్రతిపాదన చివరి పరిశీలనలో ఉందని..అయితే.. గతంలో వచ్చిన అభ్యంతరాల మేరకు.. ఓ సారి పూర్తి స్థాయి పరిశీలన జరుపుతామని ఆ లేఖ సారాంశం. దీనిపై.. కేంద్రం.. రాష్ట్రానికి లేఖ రాసింది. కొత్తగా అధికారం చేపట్టినప్పుడు లేఖ రావడంతో ఇప్పుడే కొత్త సర్కారు ఏర్పడిందని .. దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు నిర్ణయాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మూడు సార్లు ప్రభుత్వం ఏ నిర్ణయం చెప్పకపోవడం.. నిర్మలా సీతారామన్ మాట్లాడినా.. ఫలితం లేకపోవడంతో.. ప్రపంచబ్యాంక్ రుణ ప్రతిపాదనను విరమించుకుంది. అంటే.. ప్రస్తుత ఏపీ సర్కార్ ప్రాధాన్యాల్లో అమరావతి లేకపోవడంతో.. రుణం విషయంలో.. ఎలాంటి ఆసక్తి చూపించలేదన్న విషయం.. నిర్మలా సీతారామన్ వివరించారు. దీనిపైనా.. కేంద్రంపై నిందలేస్తున్నారన్న అసంతృప్తి బీజేపీ -జనసేనల్లో కనిపిస్తోంది.