వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు ఈ శుక్రవారమూ హాజరు కాలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని .. అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని.. తన లాయర్ చేత ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయించారు. జగన్ మినహా.. ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి కోర్టుకు హాజరు కావడం లేదు. మూడు వారాల కిందట.. సీబీఐ కోర్టు సీరియస్ అవడంతో.. రెండు వారాల కిందట.. ఒక్క సారి.. రెండు గంటల పాటు కోర్టు హాజురయ్యారు. అప్పుడే న్యాయమూర్తి.. తప్పనిసరిగా నిందితులంతా కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.
అయితే జగన్మోహన్ రెడ్డి అధికార విధుల పేరుతో.. కోర్టుకు హాజరు కాకుండా.. ఆబ్సెంట్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఆయన పెట్టుకున్న వివిధ రకాల పిటిషన్లని సీబీఐ కోర్టులు కొట్టి వేశాయి. ఈ వారం.. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్పై ఈడీకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. కీలకమైన విచారణ ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టడం న్యాయవర్గాల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే.. కోర్టుకు డుమ్మా కొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలోనే… ఓ సారి ఇలా ప్రతీ వారం ఆబ్సెంట్ పిటిషన్లు దాఖలు చేయడంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాకపోతే తాము ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినప్పటికీ.. జగన్ అదే పంథాలో ఉన్నారు. దీనిపై.. కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.