మొత్తానికి తెదేపా కు చెందిన మరో ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశానికి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తాజాగా మంగళవారం నాడు తెరాసలో చేరిపోయారు. చాలాకాలంగా వివేక్ చేరిక గురించి పుకార్లు వినిపిస్తున్నప్పటికీ.. గ్రేటర్ ఎన్నికల పర్వం కూడా పూర్తయిన తర్వాత అది కార్యరూపం దాల్చింది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ పరిస్థితి ఇదివరకటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ తెదేపా ఎమ్మెల్యేలను బతిమాలి పిలిచే స్థితిలో లేదు, వారై ఎగబడి వస్తే ఆలోచించి చేర్చుకునే స్థితిలో ఉంది. అందుకే ఎమ్మెల్యే వివేక్ కు గతంలో తెరాసనుంచి ఉన్న ఆఫర్ ప్రకారం ఇప్పుడు చెల్లిస్తున్నారా? లేదా, ఏమైనా కోత పెట్టేశారా? అనే అనుమానాలు పలువురిలో వినిపిస్తున్నాయి.
గతంలో తెదేపా ఎమ్మెల్యేల మీద గులాబీ వల విసిరినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా డీల్ చేశారు. వివేక్‌కు కూడా భారీ ఆఫర్‌ను అప్పట్లో ఇచ్చినట్లుగా పుకార్లు వచ్చాయి. అయితే లోకేష్ తనకు చాలా సన్నిహితుడని, ఎంతో నమ్మకంతో టిక్కెట్ ఇచ్చారని వివేక్ బీరాలు పోయాడు. వివేక్‌తో డీల్‌కు సంబంధించి.. అయిదు నక్షత్రాల హోటళ్లలో పలుమార్లు విందు భేటీలు జరిగాయి. అయితే ఆయన ఒక పట్టాన తేల్చలేదు.
గ్రేటర్ ఎన్నికలకు పూర్వం ఒక అభిప్రాయానికి వచ్చాడని అన్నారు. డీల్, ఆఫర్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత చేరుతారని చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు నగరంలో తెరాస బలం ఇంతగా పెరిగిన తర్వాత పాత డీల్ ప్రకారం వివేక్‌కు ఆఫర్ చెల్లిస్తారా? లేదా, ఆయన రాజీపడి వచ్చి చేరాల్సిందేనా? అనేది అందరి సందేహంగా ఉంది.
నగరంలో మరో ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలు కూడా తెరాస బాటలోనే ఉన్నట్లుగా సమాచారం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చాలా కాలం కిందట నగరంలోనే అయిదుగురు తెదేపా ఎమ్మెల్యేలమీద తెరాస వలవేసినట్లుగా.. పుకార్లు వచ్చాయి. అయితే అప్పట్లో చాలా మంది దానిని మూకుమ్మడిగా ఖండించారు. ఇప్పుడు అలాంటి వారంతా కూడా తెరాస బాటలోనే ఎగబడి వెళుతున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.