ఆర్ ఎక్స్ 100తో పాయల్ రాజ్పుత్ పేరు మార్మోగిపోయింది. అగ్ర సంస్థలన్నీ తనతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఎగ్రిమెంట్లు చేయించుకున్నాయి. ఆర్ ఎక్స్ లాంటి మరో హిట్టు దక్కితే కచ్చితంగా పాయల్ అగ్ర హీరోయిన్ల రేసులోకి వచ్చేద్దును.కాకపోతే.. తాను కూడా వన్ సినిమా వండర్ లా తయారైంది. ఆర్.ఎక్స్ 100 తరవాత తన ఖాతాలో చెప్పుకోదగిన సినిమా లేదు. ఆర్డీఎక్స్ లవ్ సినిమా డిజాస్టర్ అయ్యింది. వెంకీ మామలో తన పాత్రకు అంత సీన్ లేకుండా పోయింది. ఇప్పుడు రిలీజ్ అయిన డిస్కోరాజాలోనూ అంతే.
ఇందులో మూగ, చెవిటి అమ్మాయిగా నటించింది పాయల్. సాధారణంగా ఈ తరహా పాత్రలొస్తే.. నటీనటులలోని నటకా కౌశలం బయటకు వస్తుంది. ఈ సినిమాలో మాత్రం పాయల్ లోని లోపాలు మరింత కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఇబ్బంది పడింది. మేకప్ కూడా సరిగా లేదు. వయసు మరీ ఎక్కువైపోయినట్టు కనిపించింది. సినిమా చూశాక తన పాత్ర కూడా అంతగా గుర్తుండదు. ప్రాజెక్టుల్ని చూసి ఒప్పుకుంటుంది తప్ప, తన పాత్ర, అందులో ఉన్న ప్రాధాన్యం గుర్తించకుండా గుడ్డిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతోందనిపిస్తోంది. కథలు, పాత్రల ఎంపికలో తన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రేజ్ ఉండగానే నాలుగు సినిమాలు చేసుకుని వెళ్లిపోదామనుకుంటే సరే.కొన్నాళ్లు నిలబడాలంటే మాత్రం ఈ పద్ధతి మార్చుకోవాల్సిందే.