రాజధాని వికేంద్రీకరణ బిల్లును బయటకు తీసుకు రావడమే లక్ష్యంగా.. వైసీపీ సర్కార్ టీడీపీ ఎమ్మెల్సీలపై గురి పెట్టింది. 12 టీడీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించి.. శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను దించివేసి తమకున్న మెజార్టీ బలంతో శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లును వెనక్కి తెప్పించాలని భావిస్తోంది. ఆ బిల్లును శాసనమండలిలో ఆమోదించటమో.. తిరిగి శాసనసభకు పంపించడమో చేస్తే పని పూర్తయిపోతుందని అంచనా వేసుకుంటోంది. ఆదివారం సాయంత్రంలోగా ఆపరేషన్ పూర్తి చేయాలని వైసీపీ నిర్ణయానికి వచ్చింది.
తమతో ఏడుగురు ఎమ్మెల్సీలు ఫోన్ టచ్ లో ఉన్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఐదుగురు ఎమ్మెల్సీలకు ఫోన్లు చేసి ఇద్దరు మంత్రులు వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఇద్దరు ఎమ్మెల్సీలపై ఉన్న పాత కేసులు కూడా తిరగదోడి తాము చెప్పినట్టు నడుచుకోకపోతే ఆ కేసులను బయటికి తీస్తామని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. మరో ఎమ్మెల్సీకి పెద్ద మొత్తంలో ఆఫర్ రావడంతో ఆయన సంతానం మెత్తబడ్డారని.. ఆయనపై ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు బంధువుల ద్వారా వల విసిరే ప్రయత్నం జరిగిందని అంటున్నారు.
తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. తెలుగుదేశం ఎమ్మెల్సీలకు అధికార పార్టీ నేతలు ప్రలోభాల వల విసురుతుండటంతో వాటిని తిప్పికొట్టాలని .. అందరూ పార్టీతోనే ఉన్నారని.. నిరూపించాలని చంద్రబాబు… ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంత మంది వస్తారు.. అనేదాన్ని బట్టి.. వైసీపీ ప్రయత్నాలు ఎంత మేర సక్సెస్ అయ్యాయో.. అంచనాకు రావొచ్చని..టీడీపీ వర్గాలంటున్నాయి.