ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉందని.. మన రాష్ట్రానికి శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెబుతూంటే… ధర్మాన వంటి ఆయన శిష్యులు.. ప్రపంచంలో ఎగువ సభల ఎన్నెన్ని దేశాల్లో ఉన్నాయో లెక్కలు వివరిస్తున్నారు. వాటిలో ఎంత నిజముందో.. వారికే తెలియాలి కానీ.. ప్రస్తుతం దేశంలో తమ రాష్ట్రానికి శాసనమండలి పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ.. పది రాష్ట్రాలు కేంద్రానికి తీర్మానాలు పంపాయి. కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు శాసనమండలిని ఏర్పాటు చేసుకుందామని.. ఎదురు చూస్తున్నాయి. వీటిలో గతంలో.. శాసనమండలిని రద్దు చేసుకుని.. మళ్లీ కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలు ఐదు ఉండగా… కొత్తగా ఏర్పాటు చేసుకునే చాన్సివ్వాలని మరో ఐదు రాష్ట్రాలు కోరుతున్నాయి.
శాసనమండలిని ఏర్పాటు చేసుకోవడం అనేది.. రాష్ట్రాల ఇష్టం. ఆ ప్రకారం… మొదట్లో కొన్ని రాష్ట్రాలు శాసనమండలిని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్ అవసరం లేదని రద్దు చేసుకున్నాయి. మళ్లీ కొన్నేళ్లుగా.. తమకు మళ్లీ మండలి అవసరం ఉందని.. ఏర్పాటు చేయాలంటూ.. కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2018లో మండలిని పునరుద్ధరించాలని మోదీ సర్కార్కు తీర్మానం పంపారు. కానీ దాన్ని కోల్డ్ స్టోరేజీలోనే పె్టటారు. పంజాబ్ ఇప్పటికి మూడు సార్లు తీర్మానాలు చేసి పంపింది. బెంగాల్ 2017లో తీర్మానం చేసి పంపినా.. కేంద్రం పట్టించుకోవడం లేదు.
ఇప్పటి వరకూ శాసనమండలి ఏర్పాటు చేసుకోని ఐదు రాష్టాలు.. తమ రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ.. కేంద్రానికి తీర్మానాలు పంపాయి. ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ కౌన్సిల్ లేదు. గత రెండు, మూడేళ్లుగా ఈ రాష్ట్రాలు.. అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి పంపినా.. ఇంత వరకూ కేంద్రం స్పందించలేదు. శాసనమండలికి సంబంధించి.. రాష్ట్రాలు పంపే తీర్మానాలను కేంద్రం… ఓ వరుసగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన.. ఏపీ సర్కార్ చేసే తీర్మానం.. ఈ పది తీర్మానాల తర్వాతే… కేంద్రం పరిగణిస్తుంది. వాటినే ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టిన కేంద్రం.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన తీర్మానాన్ని ఆఘమేఘాల మీద పరిష్కరిస్తుందా..అన్నది చర్చనీయాంశంగా మారింది.