సీబీఐ, ఈడీ కోర్టులు .. రావాలి జగన్ అన్న ఒక్క నినాదానికే ఫిక్సయిపోవడంతో.. ఏపీ ముఖ్యమంత్రి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న తాను ప్రతి శుక్రవారం..కోర్టుకు వెళ్లడం ఏమిటన్న ఉద్దేశంలో ఉండటంతో.. మినహాయింపు కోసం మరోసారి కోర్టు మెట్లెక్కారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రిగా తాను తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో ఉంటున్నానని.. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు.
మొదట సీబీఐ కేసుల్లో.. తర్వాత ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ, ఈడీ కోర్టులు నిరాకరించాయి. తప్పనిసరిగా కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. 31వ తేదీన కోర్టుకు రాకపోతే.. తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని హె్చచరికలు కూడా జారీ చేశాయి. ఈ క్రమంలో… హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి గతంలో పాదయాత్రకు సిద్ధమైన సమయంలోనూ.. జగన్ ఇలాంటి పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు కూడా సీబీఐ కోర్టు కొట్టి వేసింది. ఈ ఉత్తర్వులపై హైకోర్టుకెళ్లారు. హైకోర్టు కూడా.. కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
దీంతో వారం వారం.. కోర్టుకు వస్తూ పాదయాత్ర చేశారు. కొద్ది రోజుల క్రితం.. సీబీఐ కోర్టు మరోసారి మినహాయింపు నిరాకరించినప్పుడు ఇచ్చిన తీర్పులో.. హైకోర్టు కూడా.. గతంలో మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించినందున.. సుప్రీంకోర్టుకే వెళ్లే అవకాశాన్ని ఇచ్చింది. అంటే.. హైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని సీబీఐ కోర్టు ఇవ్వలేదు. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం.. వ్యూహాత్మకంగా చేశారన్న అభిప్రాయాలు న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.