గజ్వేల్ అంటే అందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పూచిక పుల్ల.. అటు నుంచి ఇటు కదలాలన్నా.. ఆయన అనుమతి ఉండాల్సిందే. కానీ మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో మాత్రం… కేసీఆర్ బహిరంగ ప్రకటనను.. పూచికపుల్లలా తీసి పడేశారు… టీఆర్ఎస్ నేతలు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీకి ఎన్నికలు జరగక ముందే చైర్మన్ అభ్యర్థిగా వంటేరు నారాయణరెడ్డి అనే టీఆర్ఎస్ నేతను కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ నారాయణరెడ్డి.. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన గురించి కేసీఆర్కు బాగా తెలుసు కాబట్టి.. ఎన్నికలు జరగకముందే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎన్నికల్లో ఆయననే చైర్మన్ అభ్యర్థిగా ముందు పెట్టి ప్రచారం చేశారు. 12వ వార్డు నుంచి ఆయన ఘన విజయం సాధించారు.
కేసీఆర్ స్వయంగా చెప్పారు కాబట్టి.. ఆయనే చైర్మన్ అనుకున్నారు. తీరా చైర్మన్ ఎన్నిక హాల్లోకి అడుగు పెట్టే సరికి.. రాజమౌళి అనే వ్యాపారస్తుడి పేరు తెరపైకి వచ్చింది. ఆయననే… టీఆర్ఎస్ పరిశీలకులు… బలపరిచి.. చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. దీంతో వంటేరు నారాయణరెడ్డి హతాశుడవ్వాల్సి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా… నారాయణరెడ్డికి పదవి ఇవ్వకపోవడం ఏమిటన్న చర్చ గజ్వేల్లో జరుగుతోంది. కేసీఆర్ తరపున గజ్వేల్ నియోజకవర్గాన్ని చూసుకునే ఓ ఎంపీ… మరో మంత్రి ఇలా.. కావాలనే నారాయణరెడ్డికి ఝులక్ ఇచ్చారని అంటున్నారు. రాజమౌళి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారని.. ఆయా నేతల్ని సంతృప్తి పరిచారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వంటేరు నారాయణరెడ్డి లా …రాజమౌళి టీఆర్ఎస్ లో మొదటి నుంచి లేరు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు.
ఈ పరిణామం.. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం.. చర్చనీయాంశంగా మారింది. ఇది కేసీఆర్కు తెలిసే జరిగిందా.. లేక… ఎంపీ, మంత్రి కలిసి గూడుపుఠాణి నడిపారా.. అన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. తన నియోజకవర్గంలో ఇచ్చిన హామీ మేరకు… పార్టీ నేతకు..చైర్మన్ పదవి మాత్రం ఇప్పించలేకపోయారు.