జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాలను దాదాపుగా వదులుకుంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచీ ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ శ్రద్ధ పెడుతున్నారు. తెలంగాణలో ఏ స్థాయి ఎన్నికలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో, పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో వ్యవస్థీకృతం కాలేదన్న కారణం చెప్పారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చెయ్యలేదు. అనివార్య కారణాలతో అభ్యర్థులను నిలబెట్టలేకపోతున్నామనీ, కానీ పవన్ కల్యాణ్ అభిమానులు ఎవరైనా స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగితే జనసేన మద్దతు ఉంటుందని ఓ ప్రకటన చేసి ఊరుకున్నారు. మొత్తంగా, జనసేన తెలంగాణలో లేదు అనే ఒక అభిప్రాయాన్ని దాదాపుగా కలిగించేశారు. అయితే, ఇప్పుడు భాజపాతో కొత్తగా పొత్తు కుదిరిన ఈ సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ రాబోతున్నారు. ఇలా చెప్పేకంటే… భాజపా తీసుకొస్తోందనడం సరైంది.
తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమౌతున్నామన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఇదే అంశమై పవన్ కల్యాణ్ తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడామనీ, త్వరలోనే ఆయనతో స్వయంగా భేటీ అయ్యాక ఇక్కడి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంటుందన్నారు. భాజపాతో కలిసి పనిచేసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారనీ, అన్ని రాష్ట్రాల్లో పవన్ సేవల్ని ఉపయోగించుకుంటామని లక్ష్మణ్ చెప్పారు.
భాజపాతో పవన్ పొత్తు కేవలం ఆంధ్రా వరకే అనుకుంటే, తెలంగాణలో కూడా అంటున్నారు! ఇక్కడున్న పవన్ అభిమానుల్ని తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్లాన్ చేస్తోంది. ఇక్కడ జనసేన కార్యక్రమాలు తగ్గించుకున్న పవన్ ని మరోసారి తెలంగాణ రాజకీయాల్లోకి భాజపా తీసుకొస్తోందని చెప్పాలి. అయితే, ఈ అవకాశాన్ని పవన్ ఎలా వినియోగించుకుంటారు అనేదీ చూడాలి. ఇప్పుడు జనసేన పార్టీ కార్యక్రమాలను ఇక్కడా పెంచడం ద్వారా ఉన్న అభిమానుల్ని పవన్ సొంత పార్టీవైపు ఆహ్వానించి, భాజపాకి మద్దతు ఇవ్వండని కోరడం ఒక పద్ధతి. ఎలాగూ జనసేనకు ఇక్కడ సరైన వ్యవస్థ లేదు కాబట్టి, ఈ అవకాశాన్ని భాజపా అందిపుచ్చుకుని, పవన్ అభిమానులు తమవైపు రండి అంటూ నేరుగా భాజపాలోకి చేర్చుకోవడం మరో పద్ధతి. మొదటిది జనసేన బలం పెంచేదయితే, రెండోది జనసేనాని పేరుతో భాజపా బలపడేది! పవన్ తెలివిగా వ్యవహరిస్తే… తెలంగాణలో పార్టీ పునాదులు వేసుకునే ఛాన్స్ అవుతుంది.