శాసనమండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం.. ఆ రెండు బిల్లులు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు. ఇవి ప్రస్తుతం శాసనమండలిలో ఉండిపోయాయి. రద్దు చేయాలని తీర్మానం చేశారు కనుక.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు పాసయినట్లు ప్రభుత్వం లెక్క వేసుకుంటుందా..? మండలిని ఇక పరిగణనలోకి తీసుకోకుండా చట్టాలు చేస్తుందా..? అన్న అనుమానాలు ప్రజల్లో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రస్తుత మొదటి లక్ష్యం.. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను..చట్ట రూపంలోకి తెచ్చుకోవడం. హుటాహుటిన మండలి రద్దు చేయడానికి కూడా అదే కారణం.
ఇప్పుడు.. రద్దు తీర్మానం చేసేశారు కాబట్టి.. వాటిని చట్టాలు భావించి..ప్రభుత్వం అడుగులు ముందుకు వేయబోతోందా.. అన్న సందేహాలు సహజంగానే వస్తున్నాయి. ఒక వేళ…ఇప్పుడు సాద్యం కాదు అనుకుంటే.. బడ్జెట్ సమావేశాల్లో బిల్లులు పెట్టి.. మండలితో సంబంధం లేకుండా.. ఆమోదించేసుకుంటారా.. అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే.. రాజ్యాంగ పరంగా ఓ సంక్లిష్టత ఏర్పడుతుంది. శాసనమండలి ఆమోదం లేకుండా.. బిల్లులు చట్టాలు కావడం .. క్లిష్టతరమైన ప్రక్రియ. దానికి వేరే లెక్క ఉంటుంది. అసలు మండలి ఉనికిలో ఉన్నా పరిగణలోకి తీసుకోకుండా.. ప్రభుత్వం చట్టాలు చేస్తే.. రాజ్యాంగ ఉల్లంఘన అయ్యే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ పట్టదల ప్రకారం.. చూస్తే.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని.. నేడో రేపో చట్టాలుగా ప్రకటించినా.. ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. దీనిపై ప్రభుత్వం వ్యూహం ఏమిటో.. మండలి విషయంలో… పూర్తి స్థాయిలో రద్దయ్యే వరకూ ఏం చేస్తుందో.. దాన్ని బట్టి పర్యవసానాలు కూడా ఉండే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి తనకు 151 సీట్లు ఉన్నాయని.. తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా.. ప్రభుత్వం వైపు నుంచి తప్పు మీద తప్పులు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.