వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కేసుల్లో హైకోర్టులో కాస్త ఊరట లభించిన సూచనలు కనిపిస్తున్నాయి. హైకోర్టు నేరుగా.. కోర్టుకు హాజరు మినహాయింపు ఇవ్వలేదు కానీ.. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని మాత్రం.. జగన్ తరపు న్యాయవాదులకు సూచించింది. సీబీఐ, ఈడీ కోర్టులు.. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వ్యక్తిగత హాజరు మినహాయింపు దరఖాస్తులను తిరస్కరించాయి. దీంతో సీబీఐ కేసుల్లో.. హాజరు మినహాయింపు కోసం.. జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై..హైకోర్టు విచారణ జరిపింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నందున మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా..శుక్రవారం..కోర్టుకు వెళ్లకుండా మినహాయింపు కావాలని.. జగన్ తరపు న్యాయవాదులు కోరారు. దానిపై.. ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయని హైకోర్టు.. విచారణ వి,యాన్ని మాత్రం సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఈ కారణంతో.. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా.. డుమ్మా కొట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే..గత వారం విచారణలో ఈడీ కోర్టు కూడా.. హెచ్చరికలు జారీ చేసింది. 31వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే.. తదుపరి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కారణంగా చూపి.. ఆయన కోర్టుకు డుమ్మాకొట్టవచ్చని అంటున్నారు. అయితే .. జగన్కు మినహాయింపు హైకోర్టు ఇవ్వలేదని.. చెబుతున్నారు. జగన్ ఎలాంటి అడుగు వేస్తారన్నది గురువారం తేలే అవకాశం ఉంది.