అధికార పార్టీ తెరాస మీద విమర్శలు, ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదన్న అసంతృప్తి, ఈసీ విధి నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్న ఆవేదన… పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో ఇవి సహజంగానే ఇప్పుడు ఉంటాయి, అవే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ మీద పోరాటం చేస్తాం, అధికార పార్టీ తీరును ఎండగడతాం అని చెబుతూనే… ఈసారి మరో కొత్త అంశంపై పోరాటానికి సిద్ధమంటున్నారు. ఈసారి ఏకంగా తెలంగాణలో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం పోయిందన్న తీవ్ర విమర్శ చేశారు ఉత్తమ్. దీని మీద తాను ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయబోతున్నానని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిస్పక్షపాతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు ఉత్తమ్. ఎన్నికలు నిర్వహించే బదులు.. ఫామ్ హౌస్ లో కూర్చుని విజేతల్ని ప్రకటించేసుకుని, ఏకపక్షంగా గెలిచామని చెప్పుకుంటే సరిపోయేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ న్యాయవ్యవస్థ ఎంత గొప్పగా ఉందంటే… వార్డుల రిజర్వేషన్ల ప్రకటనకీ, నామినేషన్లకీ మధ్య గడువు ఉండాలని తాను కోర్టులో పిటీషన్ వేశాననీ, అవును కరెక్టే… నామినేషన్ల గురించి ఇలా తెలిస్తే నేనైనా నామినేషన్ ఎలా వేస్తా అంటూ ఛీఫ్ జస్టిస్ట్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అలా వ్యాఖ్యానించిన ఆయనే… ఒక్క లైన్లో తన పిటిషన్ డిస్మిస్ చేసేశారన్నారు. ఆరోజు సాయంత్రం 7 గంటలకి పిటీషన్ డిస్మిస్ అయితే… మరో గంటలో, అంటే 8కి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేసిందన్నారు. తెలంగాణలో న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం తగ్గిపోతోందన్నారు. కొన్ని విషయాలను తాను బయట మాట్లాడలేకపోతున్నాననీ, లోక్ సభలో మాట్లాడతా అన్నారు. తెలంగాణ న్యాయస్థానంలో జరుగుతున్న కొన్ని విషయాలను అక్కడ చెబుతా అన్నారు. అంతేకాదు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా కొన్ని అంశాలు తీసుకెళ్తా అన్నారు.
ఈసీ గురించి మాట్లాడుతూ… ఎన్నికలు నిర్వహించాల్సిన ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాజకీయ పార్టీల నాయకుల్ని తన ఆఫీస్ కి పిలుస్తుంటారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలకు లోనుకాని ఒక్క ఓటరైనా ఎక్కడైనా ఉంటే చెప్పండీ.. వెళ్లి మేమూ కలుస్తామన్నారు. అధికార దుర్వినియోగం, వ్యవస్థల దుర్వినియోగం అనేది రాష్ట్రంలో పరాకాష్టకు చేరిందన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ వెర్సెస్ తెరాస అన్నట్టు జరిగినవి కాదనీ, కాంగ్రెస్ వెర్సెస్ డబ్బు లిక్కర్ పోలీసింగ్ అన్నట్టుగా జరిగినవి అన్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా… రాష్ట్రంలో హైకోర్టు మీద ఉత్తమ్ విమర్శలు చేయడం ప్రత్యేకంగానే చూడాలి. ఈ విషయాన్ని ఏకంగా పార్లమెంటుతోపాటు, సుప్రీం కోర్టు వరకూ తీసుకెళ్తా అంటున్నారు. చూడాలి.. ఏం చేస్తారో!