జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో ఎంపీలతో జరిగిన సమావేశంలో… ఈసారి పార్లమెంటులో గట్టి వాదనే వినిపించాలనీ, గతంలో మాదిరిగా ఉత్త చేతులు ఊపుకుంటూ తిరిగి రావొద్దంటూ ఎంపీలను కేటీఆర్ హెచ్చరించారు! రాష్ట్రానికి రావాల్సిన నిధులూ కేటాయింపులూ వివిధ పన్నుల్లో వాటాలపై పోరాటం చేయాలని సూచిస్తూనే… ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలను అర్థం చేసుకుని వ్యవహరించాలని కేటీఆర్ ప్రత్యేకంగా కోరడం గమనించాల్సిన అంశం! నిజానికి, తెరాస ప్రాధాన్యత కూడా ఇప్పుడు ఇదే.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం అంటే ఏముందీ… మున్సిపల్ ఎన్నికల విజయం తరువాత మరోసారి జాతీయ రాజకీయాలపై ఆయన స్పందించారు కదా! రెండు జాతీయ పార్టీలూ దేశంలో ఫెయిల్ అయ్యాయనీ, ఫెడరల్ ఫ్రంట్ దేశంలో అధికారంలోకి వస్తుందని కూడా జోస్యం చెప్పారు. ఆ విజన్ కి అనుగుణంగా తెరాస వాదన వినిపించాలన్నది వ్యూహం. సీఏఏ, ఎన్నార్సీ మీద పార్లమెంటులో నిరసన వ్యక్తం చేయమంటూ ఎంపీలకు కేటీఆర్ చెప్పారు. ఇవి ప్రజలకు అవసరం లేని రాజకీయ అంశాలనీ, నిరుద్యోగం ఆర్థికమాంధ్యం లాంటి సమస్యలపై కేంద్రం దృష్టిపెట్టేలా చేయాలన్నారు. తెలంగాణ స్ఫూర్తితోనే కేంద్రం కూడా కొన్ని పథకాలను ప్రారంభించిందని సభలో గుర్తుచెయ్యాలన్నారు. కానీ, తెలంగాణలో అమలౌతున్న కేంద్ర పథకాలకు నిధులు ఇవ్వడం లేని అంశాన్ని గుర్తుచేసి నిలదీయాలన్నారు.
కేటీఆర్ మనోభావమేంటో ఎంపీలకు అర్థమయ్యే ఉంటుంది. ముఖ్యంగా సీఏఏని వేదికగా మార్చుకుని… దీనిపై నిరసన వ్యక్తం చేసే పార్టీలను కలుపుకుని పోవాలన్నదీ తెరాస వ్యూహంగా కనిపిస్తోంది. భావసారూప్యతగల పార్టీల ఎంపీలతో దోస్తీకి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇదే అంశమై త్వరలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, పార్టీలతో హైదరాబాద్లో ఒక సమావేశం కూడా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించిన సంగతి గుర్తుచేసుకోవాలి. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించాలన్నది పార్టీ ఆదేశంగా చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయం అందించారంటూ ఎంపీలను కేటీఆర్ అభినందనలతో ముంచెత్తారు. ఇదే జోష్ తో పార్లమెంటులో ఏరకంగా వ్యవహరిస్తారో చూడాలి.