ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం ఓ అధికారిక సమీక్షా కార్యక్రమం నిర్వహించి.. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ… అంతకు మించిన విశేషం ఉందన్న అభిప్రాయం మాత్రం బలంగానే వినిపిస్తోంది. దీనికి కారణం.. జగన్మోహన్ రెడ్డి.. కోర్టుకు హాజరవడానికే.. హైదరాబాద్ వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్పుకునేందుకు ఆయన హైదరాబాద్ వైపు రావడం లేదు. అలాంటి హఠాత్తుగా ఆయన బుధవారం హైదరాబాద్ పయనమయ్యారు.
బుధవారం ఉదయం వరకూ.. ఆయన పర్యటన షెడ్యూల్లో లేదు. హఠాత్తుగా పయనమవడంతో వైఎస్ వివేకా హత్య కేసులో .. ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ అంశంలో కుటుంబ పంచాయతీ కోసం..హైదరాబాద్ వెళ్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. సునీతకు నచ్చజెప్పి రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేలా చేయడానికే వెళ్తున్నారా.. అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
గురువారం పెళ్లికి హాజరవడానికి బుధవారమే.. హైదరాబాద్ వెళ్తున్న ఆయన.. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు అక్కడే ఉంటారా లేదా అన్నదానిపై మాత్రం సీఎంవో వర్గాలు కానీ.. వైసీపీ నేతలు కూడా.. ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. 31వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే.. తగు ఆదేశాలు జారీ చేస్తామని గత వారం కోర్టు హెచ్చరించింది. అయితే.. హైకోర్టులో సీబీఐ కోర్టు తీర్పుపై సవాల్ చేశారు. హైకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉందన్న కారణంగా ఆయన కోర్టుకు డుమ్మా కొట్టవచ్చన్న ప్రచారం జరుగుతోంది.