ప్రేమంటేనే అక్షరాలు అవసరం లేని కవిత. పదాలు పేర్చలేని పాట. దాన్ని మరింత కవితాత్మకంగా వర్ణిస్తే, ఓ ప్రేమకథని పాటలా, ఓ కవితలా పేరిస్తే..? అలాంటి ప్రయత్నమే చేసింది ‘జానూ’. తమిళంలో హిట్టయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ’96’ చిత్రానికి ఇది రీమేక్. శర్వానంద్, సమంత జంటగా నటించారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది.
పొయెటిట్ టచ్ ఉన్న ప్రేమకథ.. `జాను.` ట్రైలర్‌లోనూ అదే కనిపించింది.
ఓర చూపు కోసం, నీ దోర నవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్క పెడుతోంది నా హృదయం
నా వైపు.. ఓ చూపు అప్పియ్యలేవా??
– అంటూ కవితాత్మక వర్ణనతో ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి భావాత్మకంగా సాగింది ప్రచార చిత్రం. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్‌లా జాను, రాముల మధ్య వివిధ వయసుల్లో్ జరిగిన ప్రేమకథ ఇది. స్కూలు, కాలేజీ రోజుల్లో, ఓ పరిపక్వత వచ్చాక.. వీళ్ల ప్రేమకథ ఎలా నడిచిందన్నదే `జానూ` కథ.
జీవితంలో ఏమీ జరక్కపోయినా ఏదో జరిగిపోతోందని మనసుకి ముందే తెలిసిపోతుంది – అనే డైలాగ్ ఉంది ఈ ట్రైలర్‌లో. తెరపై కొత్తగా ఏమీ లేకపోయినా, ఏదో ఉండబోతోందన్న ఫీలింగ్ మాత్రం తప్పకుండా కలుగుతుంది. ప్రేక్షకుల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లగలిగే కంటెంట్ ఈ సినిమాలో ఉందన్న నమ్మకం కలుగుతుంది.
పది నెలలు నిన్ను మోసిన మీ అమ్మకు నువ్వు సొంతం అయితే
ఇన్నాళ్లుగా నిన్ను మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే.. – అనేది అద్భుతమైన భావన
మొత్తానికి ప్రేమికుల రోజు హంగామాని ‘జానూ’ కాస్త ముందే తెచ్చేసింది. శర్వా, సమంతల జోడీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, సంభాషణలు.. ఇవన్నీ ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. తమిళంలో వర్కవుట్ అయిన ఈ మ్యాజిక్.. తెలుగులో ఏమేరకు ఫలితాన్ని తీసుకొస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.