ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టార్ కేంపెయినర్ల వేటలో పడ్డట్టుంది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలో గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు! దీన్లో భాగంగానే బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తో ప్రచారం చేయించే వ్యూహంలో ఉంది. ఈరోజు ఆమె భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఆ తరువాత, అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయించే అంశమై చర్చించినట్టు సమాచారం.
మీడియాతో మాట్లాడుతూ… భాజపా దేశం కోసం చాలా చేస్తోందన్నారు సైనా. క్రీడాకారిణిగా తాను చాలా కష్టపడి పని చేస్తుంటాననీ, ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశం కోసం కష్టపడి పనిచేస్తుంటారన్నారు. ఆయనతో కలిసి దేశం కోసం ఏదైనా చేయాలన్నది తన ఆశయమన్నారు. ఆయన నాయకత్వం తనకు స్ఫూర్తిని ఇస్తూ ఉంటుందన్నారు. ఖేలో ఇండియా లాంటి కార్యక్రమాలతో క్రీడాకారులకు కూడా ప్రధాని చాలా ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. దేశం కోసం ఎంతోమంది క్రీడాకారులకు ఆడే అవకాశం దక్కుతోందనీ, పెద్ద పెద్ద అకాడమీల్లో ఛాన్సులు లభిస్తున్నాయన్నారు. తనకి రాజకీయాలు కొత్త అనీ, ఇక్కడ చాలా నేర్చుకోవాల్సింది ఉందన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందనీ, దేశంలో జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తూ ఉంటా అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సెలెబ్రిటీలతో భారీగానే ప్రచారం ప్లాన్ చేస్తోంది. సైనాతో ప్రచారం చేయించడం ద్వారా ముఖ్యంగా యువతను ఆకర్షించే అవకాశం ఉంటుందన్నది భాజపా విశ్వాసం. వాస్తవం మాట్లాడుకుంటే… సైనాకి ఒక క్రీడాకారిణిగా ఉన్న ఇమేజ్ వేరు… ఇప్పుడు రాజకీయాలు ఆమెకు పూర్తిగా కొత్త. ఆమెని భాజపా నేతగా చూడటమూ ప్రజలకి ఇంకా కొత్త. ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు కూడా సరైనీకి మరీ కొత్త. అక్కడి ఎన్నికల్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ విధానాలు, కేజ్రీవాల్ పాలన మీద భాజపా పెద్ద ఎత్తున విమర్శలు చెయ్యాలి. భాజపా ఆధిపత్యంపై ఆమ్ ఆద్మీ పోరాటం చేస్తోంది. ఇవన్నీ అర్థం చేసుకునే సరికి సైనాకి కొంత సమయం పట్టొచ్చు. కాబట్టి, ప్రస్తుతానికి ఆమె మోడీ విధానాలు నచ్చాయని మాత్రమే ప్రచారం చేయగలరు. అంతకుమించి ఇప్పుడు ఆశించలేం.