విశాఖలో రాజధాని పెట్టమని.. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులు చెప్పాయంటూ..శరవేగంగా చట్టం చేయడానికి ప్రయత్నిచిన ప్రభుత్వానికి జీఎన్ రావు రిపోర్ట్ లీక్ కావడం … ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వం… జీఎన్ రావుతోనే.. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయించింది. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో జీఎన్ రావు.. తాను రాసుకొచ్చినదంతా చదివి వినిపించారు. అందులో… విశాఖను రాజధానిగా సిఫార్సు చేశామని… చెప్పారు. నాలుగు ప్రాంతాలకు నాలుగు అభివృద్ధి మండళ్లు సిఫార్సు చేశామని.. అభివృద్ది వికేంద్రీకరణకు అది ఎంతో ముఖ్యమన్నారు.
మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం గందరగోళంగా సమాధానాలు చెప్పారు. విశాఖలో రాజధాని పెట్టమని సిఫార్సు చేయలేదని.. విశాఖకు 50 కి.మీ దూరంలో సెక్రటేరియట్ పెట్టుకోవచ్చని చెప్పామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని అంశాలు విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ఉన్నాయి కదా అన్న మీడియా ప్రశ్నలకు.. జీఎన్ రావు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. విశాఖ రాజధానికి అనుకూలం కాదనడం కాదు..విశాఖ, మచిలీపట్నం, విజయవాడలాంటి పట్టణాల్లో.. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పామన్నారు. జూన్ నెలలో 13 జిల్లాల్లో పర్యటించామని.. కొన్ని వేల మందితో ప్రత్యక్షంగా మాట్లాడామనిచెప్పుకొచ్చారు. విశాఖ తీరంలో ప్రతికూల వాతావరణం ఉన్నమాట వాస్తవమేనని .. అందుకే అక్కడ పెట్టమని చెప్పలేదు.. 50 కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెప్పామన్నారు. సముద్ర తీరప్రాంతం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరన్నారు.
మూడు రాజధానులు ఉంటేనే.. అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న ఆయన.. ఏపీలో విశాఖ ఒక్కటే ఏపీలో మెట్రోపాలిటన్ నగరమని కూడా చెప్పుకొచ్చారు. మరి ఏపీలో అభివృద్ది చెందిన ఒకే నగరంలో రాజధాని పెడితే వికేంద్రీకరణ ఎలా సాధ్యమన్న విషయం మాత్రం ఆయన కవర్ చేసుకోలేకపోయారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా.. విశాఖ రాజధాని గా రిస్క్ ఫ్యాక్టర్జోన్లోనే ఉందన్న విషయాన్ని చెప్పింది. ఈ కారణంగానే రాజధానిగా తక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. అదే విషయాలను.. జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది. కానీ ప్రభుత్వం..ఈ అంశాలను దాచి పెట్టింది. ఇప్పుడు బయటకు రావడంతో.. సంచలనాత్మకవుతోంది.