ఆర్.ఎక్స్ 100 తరవాత అజయ్ భూపతి సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. స్వయంకృతాపరాధం అనుకోండీ, టైమ్ కలసి రాలేదనుకోండి.. ఏదైతేనేం.. రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నాడు. మహా సముద్రం స్క్రిప్టు మొత్తం రెడీగా ఉన్నా ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకూ ఇంచు కూడా కదల్లేదు. చివరికి శర్వానంద్‌తో ఈ సినిమా ఓకే అయ్యింది. అయితే మరో హీరో కూడా కావాలి. అతనెప్పుడు దొరుకుతాడో చూడాలి.
ఈ సినిమాకున్న మరో అవరోధం.. బడ్జెట్. ఈసినిమాకు దాదాపు 25 నుంచి 30 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని సమాచారం. ఇద్దరు హీరోలున్న సినిమా ఇది. పైగా హీరోయిన్గా స్టార్‌నే ఎంచుకోవాలి. ఆ ముగ్గురి పారితోషికాలకు ఎక్కువ మొత్తమే వెచ్చించాలి. మరోవైపు భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయట. బడ్జెట్ తగ్గించుకోమని జెమినీ కిరణ్ చెప్పినా అజయ్ భూపతి వినలేదని టాక్. ఇప్పుడు శర్వాపై రూ.30 కోట్లు పెట్టడానికి నిర్మాతలు సాహసిస్తారా? అనేది అనుమానం. శర్వానంద్నటించిన `జానూ` ఫిబ్రవరి 7న విడుదల అవుతుంది. ఈసినిమా హిట్టయి, డబ్బులు బాగా వసూలు చేస్తే మాత్రం నిర్మాతలకు ధైర్యం రావొచ్చు. మరో హీరో ఎవరన్నది తెలిస్తే.. దాన్ని బట్టి మార్కెట్ ఓపెన్ అవుతుంది. వీలైనంత త్వరగా రెండో హీరో ఎవరన్నది తేల్చేసి, ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలని అజయ్ భూపతి భావిస్తున్నాడు.