అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నార్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఈ విషయంలో లీడ్ తీసుకుని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా పెడతానని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి.. ముస్లిం వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల్ని ముస్లింలు ఎక్కడిక్కడ నిలదీస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. రాయలసీమలో ముస్లిం జనాభా ఎక్కువ. అక్కడి ప్రజాప్రతినిధులంతా.. ముఖ్యమంత్రి.. ఎన్నార్సీకి వ్యతిరేకమని.. చెబుతున్నారు. సీఎం బహిరంగంగా చెప్పారని కూడా గుర్తు చేస్తున్నారు.
అయితే.. పార్లమెంట్లో.. ఎన్నార్సీకి, సీఏఏకి మద్దతిస్తూ.. వైసీపీ ఎంపీలు మాట్లాడిన మాటలు.. అనుకూలంగా ఓటు వేసిన విషయం.. ముస్లిం వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి తమను మోసం చేస్తున్నాడన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎన్నార్సీ అంశంలో కేంద్రంపై దాదాపుగా తిరుగుబాటు చేశారు. దీంతో.. ఆయనతో సన్నిహితంగా ఉండే జగన్ వైపు అందరి దృష్టి పడింది. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్తో కలిసి ఎన్నార్సీకి వ్యతిరేకంగా పోరాడాలన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే.. కేసీఆర్కు ఓ వెసులుబాటు ఉంది. టీఆర్ఎస్ పార్లమెంట్లో ఎన్నార్సీ, సీఏఏ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. అందులో మొహమాటపడలేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. పార్లమెంట్లో మద్దతు పలికారు. ఇప్పుడు… అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ.. ఇతర పార్టీల ముఖ్యమంత్రులతో కలిసి పోరాడటం కానీ చేయలేరు. అలా చేస్తే.. ఆయన కామెడీ అయిపోతారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. అది పెద్ద విషయం అయిపోతుంది. కేసీఆర్ పోరాటం.. ఎంత ఉద్దృతం అయితే.. జగన్మోహన్ రెడ్డి అంతగా ఇరుక్కుపోతారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నార్సీ వ్యవహారం…తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.