భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఒక కొత్త సిద్ధాంతం చెప్పారు! పార్టీల స్థాయి బట్టి వాటికి అధికారాన్ని ప్రజలు కట్టబెట్టాలన్నట్టు అభిప్రాయపడ్డారు. దేశమంతా ఒక జాతీయ పార్టీ పాలనలో ఉంది కాబట్టి, దేశ రాజధాని ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండకూడదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన స్పందిస్తూ.. భారత ప్రతిష్టను ప్రపంచవ్యాపంగా ఇనుమడింపజేస్తున్నట్టుగా ప్రధాని మోడీ సర్కారు దేశంలో అధికారంలో ఉందనీ, దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానిక పార్టీగా ఇంతవరకూ అధికారంలో ఉందన్నారు. దేశవ్యాప్తంగా మోడీ అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకూ అడ్డుపడుతోందన్నారు. ఢిల్లీ భాజపా చేతిలో ఉంటే ఇంకా అభివ్రుద్ధి జరిగేదన్నారు.
సీఏఏకి మద్దతుగా హైదరాబాద్ తో సహా అన్ని చోట్ల నుంచి మద్దతు వస్తున్నా, వద్దంటూ దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తమౌతున్నాయన్నారు రామ్ మాధవ్. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. ఢిల్లీ ప్రజల ముందు ఒక పెద్ద బాధ్యత ఉందనీ, దేశం ఇమేజ్, ఐకమత్యం, దేశ గౌరవం ఇలాంటి అంశాల ప్రాతిపదికగా ఆలోచించాలనీ, ఈ కోణం నుంచి చూస్తే భాజపా చేతిల్లో ఢిల్లీ ఉండటమే శ్రేయస్కరం అన్నారు. ఢిల్లీలో అరాచక శక్తులకు కేజ్రీవాల్ సర్కారు మద్దతు ఇస్తోందనీ, అదే భాజపాకి అధికారం ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఢిల్లీలో లా అండర్ ఆర్డర్ కేంద్రం చేతులో ఉన్నా… ప్రాసిక్యూషన్ చేసే అధికారం రాష్ట్ర పరిధిలోనే ఉందన్నారు.
దేశం ఇమేజ్, ఐకమత్యం, గౌరవం లాంటివి కేవలం జాతీయ పార్టీలు మాత్రమే కాపాడగలవా..? ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదా..? ఇదెక్కడి వాదన! ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాత్రమే అసెంబ్లీలో అధికారంలో ఉండాలనడం అసందర్భ వాదన. ప్రజలు ఇలాగే ఆలోచించి ఓటెయ్యాలని శాసించే హక్కు ఏ పార్టీకీ ఉండదు. దేశ రాజధానిలో ఫలానా స్థాయి పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలని రామ్ మాధవ్ అభిప్రాయపడుతున్నట్టుగా ఎక్కడా ఎలాంటి రూల్సూ లేవు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నప్పుడు… అక్కడి స్థానిక అంశాలే ప్రాతిపదికగా ఉండాలి. జాతీయ పరిస్థితులను అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టడమేంటో..?