మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకుని, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పాలని కమలం పార్టీ భావించింది. కానీ, అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. అధికార పార్టీకి ధీటైన స్థానాలు గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి రెండో స్థానంలో గెలిచామని పార్టీ నేతలు కొంత సంతృప్తిపడుతున్నారు. అయితే, పార్టీ నేతల్లో ఈ ఫలితాలపై తీవ్రమైన చర్చే జరిగినట్టు సమాచారం. ఏదో సాధించామని పైపైకి చెబుతున్నా, కీలక నేతల పనితీరు మీద రాష్ట్ర నాయకత్వం రుసరుసలాడిందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎంపీలు బండి సంజయ్, సోయం బాపు, అరవింద్ ల పనితీరు మీద చర్చ జరిగిందని సమాచారం.
ఈ ముగ్గురు ఎంపీలుగా ఉన్న స్థానాల పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కటీ గెలవలేకపోయింది. ఎంపీలుగా గెలిచిన తరువాతి నుంచి కేడర్ ని బలోపేతం చేయడం మీద ఈ ముగ్గురూ దృష్టి పెట్టలేదనీ, ఒక్క చోట కూడా పోటీ చేసిన స్థానాల్లో కనీసం సగమైనా గెలుచుకునే వ్యూహంతో వ్యవహరించలేదని సొంత పార్టీనేతలు అభిప్రాయపడ్డారని సమాచారం. ఈ ముగ్గురు ఎంపీలు తమ పరిధిలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ విఫలమయ్యారంటున్నారు. తాము వెళ్తే సరిపోతుందీ, మోడీ జపం చేస్తే సరిపోతోందని మాత్రమే భావించారనే విమర్శా వినిపిస్తోంది. మూడు ఎంపీ సెగ్మెంట్లలో 537 వార్డులు, 120 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 322 తెరాస గెలుచుకుంది. భాజపా కేవలం 60కి పరిమితమైంది. ఈ మూడు నియోజక వర్గాల్లో గతం నుంచీ పట్టున్న ప్రాంతాల్లో తప్ప, కొత్తగా పార్టీ విస్తరించింది ఏమీ లేదని అంటున్నారు. దీంతో ఎంపీలు ఉన్న స్థానాల్లో పార్టీ కొత్తగా ఎదిగిందేమీ లేదనే వాదన సొంత నేతల్లో ఉంది. ఈ మూడు చోట్ల పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో స్థానిక నాయకత్వం ఫెయిలందనేది పార్టీ అంతర్గత అభిప్రాయంగా తెలుస్తోంది.
ఈ మూడు లోక్ సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ వెనక్కి నెట్టామని ఎంపీలు చెప్పుకుంటున్నా… ఇకనైనా వాస్తవిక దృక్పథంతో పనిచేయాలని వారికి నేతలు సూచిస్తున్నట్టు సమాచారం. కేవలం మోడీ పేరు మీద మాత్రమే ఆధారపడితే సరిపోదనీ, సొంతంగా బలాన్ని పెంచుకోవాలంటున్నారు. దగ్గర్లో మరే ఎన్నికలూ లేవు కాబట్టి, ఇప్పట్నుంచీ స్థానికంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభావాన్ని పెంచుకునే వ్యూహాల్లో ఉండాలంటూ నేతలు వారికి సూచించినట్టు సమాచారం. నాయకుల్ని కలుపుకుని వెళ్లే ధోరణిని కూడా వీరు అలవర్చుకోవాలంటున్నారు. ఇకనైనా ఈ ముగ్గురు ఎంపీలూ కొత్త వ్యూహాలను అమలు చేస్తారో లేదో చూడాలి.