దేశ విభజన అంటే… ప్రత్యేకంగా ఇండియా, పాకిస్థాన్ లా విభజించాల్సిన పని లేదు. దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్ అన్న మహానుభావుని మాటల ప్రకారం… మనుషుల మధ్య విభజన చేసినా.. దేశ విభజన చేసినట్లే. ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోంది. ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు… దాని కేంద్రంగా జరుగుతున్న రాజకీయంతో… ప్రజల మనసుల్లో ఈ విభజన రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఓ వర్గంపై దాడులు చేయడమే దేశభక్తా..?
సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించేవారిపై కాల్పులు జరపండంటూ… అనురాగ్ ఠాకూర్ అనే కేంద్రమంత్రి… ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో.. పిలుపునిచ్చారు. అలా చేయడమే దేశ భక్తి అన్నట్లుగా ఆయన ప్రసంగించారు. ఈ పిలుపు ఇచ్చిన రెండు రోజుల్లో… ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సమూహంపై.. ఓ వ్యక్తి కాల్పులతో తెగబడ్డాడు. ఈ దృశ్యాలు చూస్తున్న వారికి ఒళ్ల గగుర్పొడిచాయి. ముస్లింలపై రాజకీయ నేతలు చేసిన ప్రకటనలతో విద్వేషాన్ని నింపుకుని… అదే దేశభక్తి అనుకుని అతను ఈ అరాచకానికి పాల్పడ్డాడు. అతనికి అర్థమయింది కొంతే. ఈ విషయంలో అతని తప్పేం లేదు. అసలు తప్పు.. ఈ విభజన భావజాలాన్ని పెంచుతున్నవారిదే.
ఆ మైనర్ మనసులో అంత విషం నింపింది ఎవరు..?
ఎన్నార్సీ వ్యతిరేక ర్యాలీపై కాల్పులు జరిపిన దుండగుడిని గోపాల్ శర్మగా గుర్తించారు. ఫైరింగ్ చేసిన వెంటనే అతను… ఇప్పుడు తీసుకోండి స్వాతంత్ర్యం అంటూ గట్టిగా అరిచాడు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడు. భారత్లో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అని అక్కడున్న వారందర్నీ హెచ్చరించాడు. ఇవన్నీ.. బీజేపీ నేతలు.. ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు వాడే నినాదాలే. ఇక్కడ అసలు కోణం ఏమిటంటే… ర్యాలీని అడ్డుకోవడానికి విరుచుకుపడే పోలీసులు..ఈ వ్యక్తి నినాదాలు చేస్తూ.. కాల్పులు జరుపుతూంటే.. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆపే ప్రయత్నం చేయలేదు. షూట్ చేసిన తర్వాత తీరిగ్గా పట్టుకున్నారు.
దేశం కోసం రాజకీయం కాదు…అధికారం కోసమే..!
ఇక్కడ సమస్య అంతా రాజకీయంలోనే ఉంది. ప్రజల మధ్య విభజన రేఖలు గిసి.. రాజకీయం చేసి.. అధికారం అనుభవిద్దామని పార్టీలు అనుకుటున్నాయి. కానీ అలాంటి అధికారం సాధించి.. దేశానికి ఏం లాభం చేస్తామో మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ప్రజల మధ్య ఉన్న వివక్షా వాతావరణం వల్లే దేశం … ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండిపోయిందనేది వాస్తవం. వాటిని నిర్మూలించాల్సిన ప్రభుత్వాలు.. కొత్త కొత్త పద్దతుల్లో ప్రజల మధ్యనే చిచ్చు పెట్టి.. రాజకీయం చేసి.. బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా.. దేశం దిగజారిపోతోంది. రాజకీయ పార్టీలకు ఇది పట్టడం లేదు.