పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే.. ఈ ఆసక్తి.. కరిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు.. ఖర్చయిపోతున్న మధ్య తరగతికి.. బడ్జెట్ ఎలాంటి ఊరటను ఇస్తుందన్నదానిపైనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అంతకు మించి ఉంది. మండలి రద్దు బిల్లును పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించుకోవాలని… ఏపీ అధికార పార్టీ వైసీపీ.. తన పలుకుబడినంతటికి ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఈ తీర్మానం కేంద్ర హోంశాఖ వద్ద ఉంది. పద్దతి ప్రకారం అయితే.. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ… బిల్లుగా మార్చి.. మంత్రివర్గానికి పంపుతుంది. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన తర్వాత పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశ పెడుతారు. ఉభయసభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకం పెడతారు. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది. దాంతో మండలి రద్దవుతుంది.
ఇప్పుడు.. పార్లమెంట్లో ఆమోదముద్ర వేయించాలంటే.. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా.. తీరిక చేసుకోవాల్సి ఉంది. అయితే రాష్ట్రాల తీర్మానాలపై కేంద్రం అంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా.. పెండింగ్‌లో అనేక తీర్మానాలు ఉన్న… మండలి రద్దు అంశంలో నిర్ణయం తీసుకోవడం .. కష్టమే. ఇప్పటికే పది రాష్ట్రాలు మండలిని ఏర్పాటు చేసుకుంటామని తీర్మానాలు పంపాయి. రద్దు చేసుకుంటామంటూ ఏపీ పంపింది. ఇప్పటికే ఏపీలో ఓ సారి మండలిని రద్దు చేసి.. మళ్లీ పునరుద్ధరించారు. ఇప్పుడు మళ్లీ రద్దు తీర్మానం పంపారు. దీంతో.. అసలు మండలి వ్యవహారాలపై ఓ జాతీయ విధానం ఉండాలన్న చర్చ.. జాతీయ పార్టీల్లో వస్తోంది. ఒక వేళ ఏపీ మండలి రద్దు బిల్లుగా మారి పార్లమెంట్‌కు వెళ్తే కచ్చితంగా ఇదే అంశంపై ఇతర పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది.
అంతే కాదు… తీర్మానాలపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే.. ఏపీ నుంచే ప్రత్యేకహోదా దగ్గర్నుంచి అనేక రిజర్వేషన్ల తీర్మానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అనేక రాష్ట్రాల నుంచి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అంతకు మించి.. అసెంబ్లీలో రాష్ట్రాలు చేస్తున్న ఎన్నార్సీ, సీఏఏ తీర్మానాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి సంగతేమిటన్న ప్రశ్న బీజేపీ ముందు ఉంటుంది. వాటికి సమాధానం చెప్పుకోవడం కష్టమవుతుంది. అందుకే.. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని బీజేపీ .. లైట్ తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది.