హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్‌లో నిన్న సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన క్రైమ్ థ్రిల్లర్ సినిమాల తరహాలో కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్న సాయంత్రం హిమాయత్ నగర్ రోడ్ నంబర్ 6లో ఫోక్స్ వాగన్ కారులో ఈ కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కారులో శశి కుమార్, ఉదయ్, సాయికుమార్ అనే ముగ్గురు వైద్యులు ఉండగా, శశికుమార్ డ్రైవర్ సీటులో ఉన్న ఉదయ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఇది చూసి సాయి కుమార్ కారు దిగి భయంతో పరారయ్యారు. డాక్టర్ ఉదయ్‌కు బుల్లెట్ చెవిపక్కగా దూసుకుపోయింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ డాక్టర్లు మాదాపూర్‌లోని లారెల్ ఆసుపత్రిలో భాగస్వాములని, వ్యాపార లావాదేవీలే విభేదాలకు కారణమని తర్వాత బయటపడింది.
అయితే కాల్పులు జరిపి పరారయిన డాక్టర్ శశికుమార్ ఇవాళ శివార్లలోని మొయినాబాద్‌లో ఒక ఫామ్ హౌస్‌లో శవమై తేలారు. ఆయన రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ చనిపోయి ఉంటారని భావించి శశికుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. మరోవైపు శశికుమార్ తన సూసైడ్ నోట్లో తన ఆత్మహత్యకు కారణం ఉదయ్, సాయి కుమార్లేనని, వారిద్దరూ తనను మోసం చేశారని పేర్కొన్నారు. ఉదయ్‌ను కాల్చింది సాయికుమార్ అని రాశారు. భార్యా పిల్లలు తనను క్షమించాలని పేర్కొన్నారు.
శశికుమార్‌ను చంద్రకళ అనే మహిళ నిన్న సాయంత్రం కారులో ఫామ్ హౌస్ వద్ద డ్రాప్ చేశారని, తర్వాత ఆమె వెళ్ళిపోయారని, పోలీసులు చెప్పారు. మద్యం సేవించి ఆ మత్తులో శశికుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయ్‌పై కాల్పులు జరపటం, తన భర్త ఆత్మహత్య చేసుకోవటం అంతా నాటకమని, ఉదయ్, సాయికుమార్ కలిసి కుట్రచేసి కిరాయి హంతకులద్వారా తన భర్తను హత్య చేయించారని శశికుమార్ భార్య కాంతి, బంధువులు ఆరోపించారు. నిన్న ఉదయం సాయికుమార్ ఫోన్ చేసి తన భర్తను పిలిచారని చెప్పారు. వారు తమకు రు.2.5 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినందుకే హత్య చేయించారని ఆరోపించారు.