మంత్రులు మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతంరెడ్డి దగ్గర ఉన్న మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖల్ని.. జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా .., మరో మంత్రి కన్నబాబుకు ఇచ్చారు. ఇక్కడ ఇద్దరికీ చెరో శాఖ కట్ చేసినట్లుగా అనిపిస్తున్నారు… గత వారం.. మంత్రి గౌతంరెడ్డి.. జగన్మోహన్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి శాఖను అదనంగా కేటాయించారు. దానికి ఆయన జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన పనితీరును మెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. వారం తిరగక ముందే.. ఆయన దగ్గర ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను.. కట్ చేసేశారు. ఇప్పటికే… కీలక మంత్రిత్వ శాఖల్ని నిర్వహిస్తున్న కన్నబాబుకు.. ఆ శాఖలు ఇచ్చారు. ఆ రెండు.. వ్యవసాయ సంబంధితమైనవని… అన్నీ ఒకరి దగ్గరే ఉంటే పాలన సులువు అవుతుందన్న ఉద్దేశంతో ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ అంతకు మించిన కారణాలున్నాయన్న గుసగుసలు ప్రభుత్వంలో వినిపిస్తున్నాయి.
కన్నబాబు… గతంలో జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసినప్పటికీ.. వైసీపీలో చేరినప్పటి నుండి.. జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయుడిగా మారారు. జగన్ ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖకు సంబంధించి.. తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు.. మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆగిపోతున్నాయని… బయటకు రావడం లేదని.. ఆయన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఆ రెండు శాఖల్ని జగన్ కన్నబాబుకే కేటాయించారని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ కనుక.. ఆయనతో జగన్ ఎప్పుడైనా రాజీనామా చేయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
మోపిదేవి వద్ద ప్రస్తుతం పశు సంవర్ధక, మత్స్యశాఖలే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం చూసినా.. వీటికి బడ్జెట్ కూడా పెద్దగా లేదు. పని కూడా పెద్దగా ఉండదు. ఓ రకంగా… పదవి ఉందన్న సంతృప్తి మాత్రమే ఉంటుంది. అదే సమయంలో మేకపాటి… భారీ పరిశ్రమ మంత్రితో పాటు కీలకమైన ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలు ఉన్నాయి. దీంతో జగన్ మోపిదేవి పైనే శీతకన్ను వేశారన్న ప్రచారం ప్రభుత్వంలో జరుగుతోంది. బహుశా మండలి రద్దును అంతర్గత సమావేశాల్లో ఆయన వ్యతిరేకించి ఉంటారని.. అందుకే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది.