అమరావతి రైతులను.. ప్రభుత్వం చర్చలకు ఒప్పించే బాధ్యతను నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అమరావతి రైతులకు కనీసం సానుభూతి ప్రకటించడానికి ఇంత వరకూ.. ఒక్కరంటే.. ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు. మొదటి సారి.. లావు కృష్ణదేవరాయులు రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనల శిబిరాలను సందర్శించారు. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. అక్కడ ఆయన రైతులపై ఇంతకు ముందెన్నడూ చూపించనంత సానూభూతి చూపించారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోగలమని.. ప్రభుత్వం అందర్నీ ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని.. . అందరూ వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.
రైతులు వ్యాపారాలు చేసి సంపాదించిన భూములు కాదని.. వారికి భూములతో భావోద్వేగం ఉంటుందని.. మంచి మాటలు చెప్పి రైతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భూములిచ్చిన ఎవరికీ అన్యాయం జరగదన్నారు. అయితే.. పలు చోట్ల.. రైతులు ముందుగా.. లావు కృష్ణదేవరాయులు అమరావతికి అనుకూలమో.. వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో కానీ.. ప్రభుత్వం నియమించే కమిటీలతో కానీ చర్చలు జరపాలంటే.. ముందుగా.. అమరావతిని కొనసాగిస్తున్నట్లుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ ఎంపీ మాత్రం.. ఈ విషయంలో నోరు తెరవలేకపోయారు. రాజధాని గ్రామాలు గుంటూరు ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి.
నర్సరావుపేట పరిదిలో ఉండవు. అయినప్పటికీ.. లావు కృష్ణదేవరాయులు ప్రత్యేకంగా రాజధాని గ్రామాలకు వచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు… రైతులను కూల్ చేసి.. వారితో.. చర్చలకు అంగీకరించేలా చేసేందుకు కృష్ణదేవరాయుల్ని వైసీపీ ప్రయోగించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం నియమించే కమిటీతో రైతులు చర్చలు జరిపితే .. ఏదోవిధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.