బీజేపీ – జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత రాజధాని విషయంలో సైలెంటయిపోయాయి. పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ మీడియా ప్రకటనలకు పరిమితమయ్యారు. గతంలో అమరావతికి మద్దతు ప్రకటించి హడావుడి చేసిన.. విష్ణువర్దన్ రెడ్డి దగ్గర్నుంచి సుజనాచౌదరి వరకూ ఎవరూ నోరు మెదపడం లేదు. కానీ.. మరీ ఇలా ఉంటే… ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అని ఆ రెండు పార్టీల నేతలు మెహమాట పడుతున్నారు. అందుకే.. ద్వితీయశ్రేణి నేతలతో అయినా… రాజధాని పోరాటం సీన్లో ఉన్నామని అనిపించుకోవాలనుకుంటున్నారు. అందుకే.. ముందుగా కవాతు చేయాలని నిర్ణయించుకుని వెనుకడుగు వేసిన రెండో తేదీనే… రాజధాని రైతులకు మద్దతుగా ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు.
కవాతు వాయిదాకు బీజేపీ – జనసేన ఎలాంటి కారణాలు చెప్పలేదు. కానీ ఆ ర్యాలీని భారీగా చేద్దామనుకున్నామని ముఖ్యనేతలు అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా వేసుకున్నామని ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేకపోవడంతో.. ప్రజల్లో సందేహాలు ప్రారంభమయ్యాయి. దీంతో కార్యాచరణపై ఇరుపక్షాలకు చెందిన నేతలు శుక్రవారం చర్చలు జరిపారు. ఫిబ్రవరి 2వ తేదీన రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లాలని నిర్ణయించారు.
జనసేన తరపున పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం, బీజేపీ తరపున రావెల కిషోర్ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల బృందం ఫిబ్రవరి 2వ తేదీన రాజధాని గ్రామాల్లో రైతులకు సంఘిభావం తెలపాలని నిర్ణయించారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకముందే ఉద్యమంలో రైతులతో కలిసి నడవాలని భావిస్తున్నారు. అయితే.. అగ్రనేతలంతా సైలెంటయిపోయి.. ద్వితీయ శ్రేణి నేతల్ని కార్యక్షేత్రంలోకి పంపడం.. మాత్రం.. లేనిపోని అనుమానాల్ని లెవనెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.