జనసేనకు గుడ్ బై చెప్పిన వీవీ లక్ష్మినారాయణ పయనం ఎటు వైపు అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత కాలం జనసేన పార్టీకి అవసరం ఉన్నంత కాలం.. ఆ పార్టీతోనే ఉంటానని చెప్పిన వీవీ లక్ష్మినారాయణ.. హఠాత్తుగా పవన్ కల్యాణ్ … సినిమాల్లో నటించడం ఇష్టం లేదంటూ… ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో.. ఏదో రాజకీయ నిర్ణయం తీసుకోవడానికే.. ఆయన ఇలా .. రాజీనామా చేశారన్న చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్పటి వరకూ… ఆయన ఏ పార్టీతో అయినా చర్చలు జరిపారన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు. లక్ష్మినారాయణ భావజాలానికి… బీజేపీ సరిగ్గా సరిపోతుందన్న అంచనాలున్నాయి.
అయితే.. ఆయన బీజేపీలో చేరడానికి జనసేనకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీ – జనసేన పొత్తుల్లో ఉన్నాయి. ఇవాళ కాకపోతే.. వచ్చే ఎన్నికల నాటికైనా విలీనం పూర్తి అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. పైగా బీజేపీతో పొత్తును.. లక్ష్మినారాయణ స్వాగతించారు. అందుకే.. బీజేపీలో చేరే ఉద్దేశం ఆయనకు లేదంటున్నారు. లక్ష్మినారాయణ మాత్రం.. ప్రస్తుతానికి రాజకీయ అడుగులు వేయదల్చుకోలేదని.. తన స్వచ్చంద సంస్థ తరపున కార్యక్రమాలు చేపడతానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన జనసేన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తనకు వ్యక్తిగత లక్ష్యాలున్నాయని చెబుతూ వస్తున్నారు.
జనసేన పార్టీలో ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్.. ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లో భాగం చేయకపోవడం వంటి కారణాల వల్లే.. లక్ష్మినారాయణ అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం ఉంది. ఏ పని అయినా.. . నాదెండ్ల మనోహర్‌తో చేయిస్తూంటారు పవన్. చాలా కీలకమైన కమిటీల్లో లక్ష్మినారాయణకు ప్రాతినిధ్యం లేదు. ప్రజల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న ఓ నేతగా.. ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం… పవన్ ఇవ్వలేదనే చర్చ మొదటి నుంచి నడుస్తోంది. అందుకే.. ఆయన జనసేన నుంచి బయటకు వెళ్లడంపై ఆ పార్టీలోనూ…. ఆయనపై సానుభూతి కనిపిస్తోంది కానీ… ఆగ్రహం కనిపించడం లేదు.