మూడు రాజధానులకు వరుసగా అడ్డంకులు ఏర్పడటం.. తప్పు మీద తప్పు చేసినట్లుగా పరిస్థితులు మారడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ అంశం తేలేవరకూ ఎటువంటి తరలింపు జరపొద్దని కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై అన్వేషణ ప్రారంభించింది. ఈ సమయంలో రైతులతో చర్చలు, వారిని ఒప్పించటం మినహా వేరే గత్యంతరం లేదని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు నిర్ణయానికి వచ్చారు. ఎలా ముందుకెళ్లాలన్నదానిపై.. చర్చలు జరిపారు. గురువారం… మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్, ఎంపీ లావు కృష్ణదేవరాయులు కలిసే సీఎం జగన్ ను కలిశారు. ఆ వెంటనే.. నర్సరావుపేట ఎంపీ.. రైతుల వద్దకు రాయబారానికి వచ్చారు.
రాజధాని రైతుల వద్దకు … కమిటీ ప్రతిపాదన తీసుకెళ్లే ఉద్దేశంతోనే… ఎంపీ లావు కృష్ణదేవరాయులను … పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనా.. ఢిల్లీ వెళ్లకుండా ఆపినట్లుగా తెలుస్తోంది. లావు కృష్ణదేవరాయులు శుక్రవారం రాజధానిలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో దీక్ష చేస్తున్న రైతుల వద్దకెళ్లారు. ప్రభుత్వం నుంచి త్వరలో ఒక కమిటీ వస్తుందని … మీ డిమాండ్లన్నీ ఈ కమిటీకి వివరించాలని సూచించారు. రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ తరపున ఓ నేత మొదటి సారిగా.. అమరావతి గ్రామాలకు వచ్చారు. అయినా.. రైతులెవరూ.. ఆయనను అడ్డుకోలేదు. ఆయన చెప్పిన మాటలను విన్నారు. అమరావతి తప్ప.. దేనికి అంగీకరించబోమని నిర్మోహమాటంగా చెప్పేశారు.
అయితే ప్రభుత్వ వ్యూహం అంతకు మించి ఉందన్న అభిప్రాయం… రైతుల్లో కలుగుతోంది. కొంతమంది వైసీపీ నేతల ద్వారా రైతు నేతలను తమ వద్దకు పిలిపించుకుని ప్రతిపాదనలను వివరించి ఉద్యమంలో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని జేఏసీ ఆనుమానిస్తోంది. ప్రభుత్వ వ్యూహాన్ని ముందే పసిగట్టిన జేఏసీ, ప్రతిపక్షాలు అమరావతి మినహా మరో ప్రతిపాదనను రైతులు అంగీకరించరని ముందే చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వ్యూహం ఏమిటో.. ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.