ఆంధ్రకు ఏం ఇచ్చారు..? గత ఆరేళ్ల కాలంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా.. ఇదో హాట్ టాపిక్ అయ్యేది. బడ్జెట్లో అసలు ఏపీకి అసలు ఏమీ కేటాయించకపోవడమో.. అరకొరగా కేటాయించడమో ఇప్పటి వరకూ జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా భిన్నంగా ఏమీ జరగలేదు. ఎన్నికలకు ముందు బడ్జెట్లో .. కనీసం ఏపీకి కొన్ని తాయిలాలు ఇస్తారేమోనని ఆశ పడిన టీడీపీ.. భంగపడి.. చివరికి కూటమి నుంచి వైదొలిగింది. ఆ తర్వాత వచ్చిన బడ్జెట్లో ఏపీకి కనీసం ప్రాధాన్యం కూడా దక్కిన సూచనలు కనిపించడం లేదు. గతంలో టీడీపీ ఒత్తిడితో పోలవరం వంటి ప్రాజెక్టులకు వందో.. వెయ్యి కోట్లో కేటాయించేవారు. ఈ సారి పోలవరం ప్రస్తావన లేదు.
ఏపీకి కేటాయించిన కేంద్ర విద్యా సంస్థలకు ఎంత కేటాయిస్తున్నారో సీతారామన్ ప్రకటించలేదు కానీ.. ఎప్పట్లాగే… అరకొర కేటాయింపులు ఉంటాయనేది సహజమే. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసినప్పుడల్లా.. వినతిపత్రంలో ఇచ్చామని చెప్పుకునే విజ్ఞప్తుల్లో ఒక్కదానికంటే.. ఒక్కదానికి కేటాయింపులు లేవు. లోటు భర్తీ దగ్గర్నుంచి రాజధాని వరకూ.. దేనికి కేంద్రం.. ఎలాంటి కేటాయింపులు చేయలేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల ప్రస్తావన కూడా లేదు. ఎన్నికలకు ముందు విశాఖ రైల్వేజోన్ ను… బీజేపీ సర్కార్ ప్రకటించింది. అది ఇంత వరకూ ప్రకటనతోనే మిగిలిపోయింది.
సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేసినప్పటికీ… వాటికి సంబంధించి చాలా పరిమితమైన ప్రకటనలే నిర్మలాసీతారామన్ చేశారు. రైల్వేజోన్ కు కనీసం.. రూపాయి కూడా కేటాయించినట్లుగా.. ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అందుకే.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి.. బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీపై..కేంద్రం వివక్షచూపిందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా సహా.. తాము అడిగిన ఏ ఒక్క దానికి నిధులు ఇవ్వలేదన్నారు. తమ ఎంపీలందరం కలిసి.. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.